నష్టాల్లోనే సింగపూర్ నిఫ్టి
రాత్రి వాల్‌స్ట్రీట్ మరో కాళరాత్రిలా మారింది. ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైన ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. పరవాలేదు…నాస్డాక్లో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అనుకుంటున్నా… రాత్రి మళ్ళీ ఐటీ, టెక్ కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. నాస్డాక్ ఏకంగా 2.84 శాతం నష్టపోగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 2.11 శాతం క్షీణించింది. గ్రోత్ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్ కూడా 1.54 శాతం క్షీణించడంతో మార్కెట్లో కలకలం రేగింది. కరెన్సీ మార్కెట్లో డాలర్ క్షీణిస్తున్నా.. ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్ తగ్గడం లేదు. రాత్రి డాలర్ ఇండెక్స్ 112 ప్రాంతానికి చేరింది. డాలర్ పడిన వెంటనే క్రూడ్ పుంజుకుంది. రాత్రి 90 డాలర్లను తాకిన బ్రెంట్ క్రూడ్ ఇపుడు 88.5 డాలర్ల వద్ద ఉంది. దీంతో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు మినహా మిగిలిన మార్కెట్లన్నీ 1.5 శాతం నుంచి 2 శాతం నష్టంతో ఉన్నాయి. అయితే చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు కూడా స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. మన మార్కెట్లలో ఇవాళ్టి నుంచి అక్టోబర్ డెరివేటివ్స్ ప్రారంభం కానుంది. దీంతో సింగపూర్ నిఫ్టి స్వల్ప లాభాలతో కన్పిస్తోంది. ప్రస్తుతానికి సింగపూర్ నిఫ్టి 40 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప నష్టాలతో ప్రారంభం కానుంది.