For Money

Business News

అయినా… జనం’ సిప్‌’ చేస్తున్నారు?

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు భయ పెడుతున్నాయి. నిజానికి వారి పెట్టుబడులు భారీ మొత్తంలో ఇంకా ఉన్నాయి. కాని ఈ మాత్రం అమ్మకాలు ఎందుకు చేస్తున్నారు. గత ఏడాది మొదలైన ఈ ట్రెండ్‌… ఈ ఏడాదిలో కూడా జోరుగా సాగుతోంది. ఈనెలలో కేవలం ఏడు ట్రేడింగ్‌ రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు సుమారు రూ. 20,000 కోట్లను దాటాయి. ఇవాళ కూడా 2,255 కోట్ల నికర అమ్మకాలు చేశారు. దేశీయ సంస్గాత ఇన్వెస్టర్లు మార్కెట్‌లో తమ భారీ కొనుగోళ్ళ ద్వారా సూచీలను కాపాడుతున్నా… ఫలితం లేకుండా పోతోంది. కారణం రీటైల్‌ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు అధికంగా ఉండటమే.
20 శాతంపైగా డౌన్‌
ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు భయపెట్టేలా ఉన్నాయి. కేవలం మూడు ట్రేడింగ్‌ సెషన్స్‌లో స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ సూచీలు ఏకంగా 5.5 శాతంపైగా క్షీణించాయి. జనవరి నెలలో గరిష్ఠ స్థాయి నుంచి స్మాల్‌ క్యాప్‌ సూచీ 8.2 శాతం క్షీణించగా, మిడ్‌ క్యాప్‌ సూచీ 5.5శాతం పడింది. ఈ ఒక్క రోజూ ఈ రెండు సూచీలు 2.5 శాతంపైగా క్షీణించాయి. గడచిన వారం రోజుల్లో 35 స్మాల్‌ క్యాప్‌ షేర్లు, 20 మిడ్‌ క్యాప్‌ షేర్లు 20 శాతంపైగా క్షీణించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
టీసీఎస్‌ బూస్ట్‌…
ఒకవైపు టీసీఎస్‌ ఫలితాలతో మార్కెట్‌ ట్రెండ్ మారుతుందని ఆశించినవారికి ఇవాళ నిరాశ మిగిలింది. టీసీఎస్‌ ఫలితాలు కేవలం ఐటీ షేర్లకు మాత్రమే జోష్‌ నింపింది. మిగిలిన రంగాల్లో ముఖ్యంగా బ్యాంకింగ్‌ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. అందులోనూ ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లను తెగ అమ్ముతున్నారు. ప్రభుత్వం నుంచి క్యాపిటల్‌ పెట్టుబడి బాగా తగ్గిందని.. దీని ప్రభావం జీడీపీ వృద్ధి రేటుపై పడుతోందని విశ్లేషకులు అంటున్నారు. అంటే… ప్రభుత్వం ఖర్చు చేయడం బాగా తగ్గించింది. దీంతో మొత్తం వ్యవస్థ నెమ్మగిస్తోంది. కాని ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ త్రైమాసికంలో కూడా బ్యాంకింగ్‌ రంగంతో సహా పలు కీలక రంగాల ఫలితాలు అంతంత మాత్రమే ఉంటాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లను ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. ఫలితాలు బాగుంటే లాభాలు స్వీకరిస్తున్నారు. లేదంటే ఎటూ అమ్మకాలు తప్పడం లేదు.
సిప్‌లు పెరుగుతున్నాయ్‌..
నిఫ్టి నష్టపోతున్నా… రీటైల్‌ ఇన్వెస్టర్లు తమ సిప్‌ పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. పెద్ద ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తుండగా, చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడుతున్నాయి. తమ షేర్ల ధరలు బారీగా తగ్గడంతో.. వాటిలో చాలా మంది యావరేజ్‌ చేస్తున్నారు. తమ ఈక్విటీ ఫండ్‌ల ఎన్‌ఏవీలు తగ్గుతుండటంతో… యావరేజీ కోసం తమ పెట్టబడులను కొనసాగిస్తున్నారు. ట్రెండ్ ఇలాగే కొనసాగిస్తే… మరి రీటైల్‌ ఇన్వెస్టర్లు తమ సిప్‌లను వాయిదా వేస్తారా అన్నది చూడాలి. ఎందుకంటే ఎన్‌ఏవీ లేదా షేర్ల ధరల పతనం చాలా స్పీడుగా ఉంది. సిప్‌ కట్టాక.. మర నెల వచ్చేసరికల్లా తమ షేర్ల విలువ భారీగా తగ్గుతోంది. దీంతో సగటు ఇన్వెస్టర్లు యావరేజీ కోసం తాపత్రయ పడుతున్నారు. అయితే అనుభవమున్న ఇన్వెస్టర్‌ మాత్రం లాభాలు స్వీకరించి… నగదు మీద కూర్చున్నారు. వెంటనే పెట్టబడికి జంకుతున్నారు. నిఫ్టీ నిలదొక్కుకునేంత వరకు వీరు వెయిట్ అండ్‌ వాచ్‌ పద్ధతినే పాటించవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో అధిక స్థాయిల వద్ద కొన్న ఇన్వెస్టర్లు ఇరుక్కుపోయారు. రాబోయే బడ్జెట్‌పై చాలా ఆశలు ఉన్నాయి. మరి ఆ బడ్జెట్‌ సూచీలను గట్టెక్కిస్తుందేమో చూడాలి.