30 చోట్ల …16 సంస్థలపై సెబి సోదాలు
యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ స్కామ్ ఇపుడు స్టాక్ మార్కెట్‌ను కుదిపేస్తోంది. ఈ స్కామ్‌కు చెందిన కొందరు మేనేజర్లు, బ్రోకర్లతో మిలాఖత్ అయి కోట్లు గడించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మార్కెట్ ధర కంటే అధిక ధరకు కొనేందుకు బ్రోకర్లతో ఒప్పందం చేసుకుని… అధిక ధర షేర్లు కొన్నారని సెబికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అంతర్గతంగా దర్యాప్తు జరిపి తొలుత ఇద్దరిని, తరవాత మరొక ఫండ్ మేనేజర్‌ను విధుల నుంచి తప్పించింది. అయితే ఈ స్కామ్ చాలా పెద్దదని తెలుస్తోంది. దీంతో స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ – సెబి రంగంలోకి దిగింది. ఈ స్కామ్‌లో పాల్గొన్న కంపెనీలు, వ్యక్తులపై సోదాలు నిర్వహిస్తోంది. గుజరాత్, మహారాష్ట్రలలో 16 సంస్థలకు చెందిన 30 చోట్ల సెబి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, బ్రోకర్లు, ట్రేడర్ల ఇళ్ళు, ఆఫీసులపై సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల సమయంలో పలు రికార్డులు, ఫోన్లు,ల్యాప్‌ట్యాప్‌లు, ట్యాబ్లెట్లతో పాటు కంప్యూటర్ హార్డ్ డ్రైవ్‌లను సెబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సొంత నిఘా విభాగం నుంచి, ఎన్ఎస్ఈ నుంచి అందిన సమాచారంతో సెబి అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్ స్పందించలేదు.