ఏథర్ పబ్లిక్ ఇష్యూకు గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూకు సెబీ అనుమతి లభించింది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు తయారు చేసే ఏథర్ ఎనర్జీ మార్కెట్ నుంచి రూ.3100 కోట్లను సమీకరించనుంది. ఆఫర్‌లో భాగంగా 2.2 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. ఆఫర్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. తాజాగా జారీ చేసే వాటాల ద్వారా సమీకరించిన మొత్తాన్ని మహారాష్ట్రలో ఫ్యాక్టరీ నిర్మాణంతో పాటు ఆర్ అండ్ డీ కోసం వినియోగించనున్నారు. కొంత మొత్తం రుణాల తిరిగి చెల్లింపు కోసం వాడుతారు. 2013లో బెంగళూరు కేంద్రం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఈ కంపెనీని నెలకొల్పారు. ఇందులో హీరో గ్రూప్ కంపెనీ పెట్టుబడులు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో చార్జింగ్ స్టేషన్లను కూడా ఈ కంపెనీ నెలకొల్పుతోంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ షేర్ 11.5 శాతం దాకా ఉంది. మొదటి స్థానంలో ఓలా ఉండగా, రెండోస్థానంలో టీవీఎస్ మోటార్స్ ఉంది. ఈ ఏడాది ఆగస్టులో ఓలా ఎలక్ట్రిక్ రూ.6,145 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీ షేర్‌కు మార్కెట్‌లో ఆదరణ లభించినా… కంపెనీ సర్వీసింగ్‌కు సంబంధించి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పైగా పలు కీలక అధికారులు కంపెనీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏథర్ ఎనర్జి ఐపీఓ వస్తోంది.