For Money

Business News

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ రిజిస్ట్రేషన్‌ రద్దు

ఇన్వెస్టర్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో హైదరాబాద్‌కు చెందిన కార్వి స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినట్లు సెబీ ప్రకటించింది. షేర్‌ మార్కెట్‌ లావాదేవీలు నిర్వహించకుండా నెల క్రితమే ఈ సంస్థపై సెబీ నిషేధం విధించింది. రిజిస్ట్రేషన్‌ రద్దు చేసినా… సెబీకి ఇవ్వాల్సి ఉన్న ఫీజులను కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొంది. గత నవంబర్‌లో ఈ సంస్థను డీఫాల్టర్‌గా ప్రకటించడంతో పాటు స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి బహిష్కరించారు. ఈ కంపెనీ ప్రమోటర్‌ అయిన సీ పార్థసారథిపై గత నెల రూ. 21 కోట్ల జరిమానా విధించడంతో పాటు ఏడేళ్ళపాటు మార్కెట్‌లో ప్రవేశించకుండా సెబీ ఆంక్షలు విధించింది. ఇన్వెస్టర్ల నిధుల్లో గోల్‌మాల్‌కు పాల్పడటంతో పాటు తనకు ఇచ్చిన పవర్‌ ఆఫ్‌ అటార్నీని పార్థసారథి దుర్వినియోగం చేసినట్లు సెబీ స్పష్టం చేసింది.