For Money

Business News

హైదరాబాద్‌ కంపెనీ ఐపీఓకు సెబి బ్రేక్‌

ఫ్రీడమ్‌ పేరుతో వివిధ రకాల వంటనూనెలను విక్రయించే హైదరాబాద్‌ కంపెనీ జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ను స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) పెండింగ్‌లో పెట్టింది. ఇలా పెండింగ్‌లో పెట్టేందుకు కారణాలను మాత్రం సెబి వెల్లడించలేదు. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 2,500 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ ఆగస్టు 9న ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈనెల 20వ తేదీన ఈ ఆఫర్‌ను పెండింగ్‌లో పెట్టినట్లు సెబి తెలిపింది. రూ. 2,500 కోట్ల విలువైన షేర్లను ఇపుడున్న యజమానులు అమ్ముతున్నారు. అంటే తమ వద్ద ఉన్న షేర్లను ఇన్వెస్టర్లకు విక్రయించదలిచారు.ఇందులో ప్రధానంగా సింగపూర్‌కు చెందిన బ్లాక్‌ రివర్‌ఫుడ్‌ 2 పీటీఈ కంపెనీ రూ. 1,250 కోట్ల షేర్లను అమ్మాలని నిర్ణయించింది. అలాగే మరో కంపెనీ గోల్డన్‌ ఆగ్రి ఇంటర్‌నేషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా రూ. 750 కోట్ల విలువైన షేర్లను విక్రయించేందుకు ఈ ఆఫర్ తలపెట్టింది. వంట నూనెల రంగానికి చెందిన అదానీ గ్రూప్‌ కంపెనీ అదానీ విల్మర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ను కూడా సెబి అనుమతి ఇవ్వకుండా వాయిదా వేసిన విషయం తెలిసిందే.