ప్చ్… అంచనాలు తప్పింది
మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎస్‌బీఐ లాభాలు పెరిగినా.. మార్కెట్ అంచనాలను మాత్రం చేరుకోలేకపోయింది. గత ఏడాదితో పోలిస్తే బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం 41 శాతం పెరిగింది. జనవరి- మార్చి త్రైమాసికంలో రూ .9,114 కోట్ల నికర లాభాన్ని బ్యాంక్ ప్రకటించింది. ఒక త్రైమాసికంలో ఈ స్థాయి నికరలాభం బ్యాంక్ ప్రకటించడం ఇదే మొదటిసారి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ .6,451 కోట్లు. బ్యాంక్ నుంచి రూ. 10,000 కోట్ల నికర లాభాన్ని మార్కెట్ ఆశించింది. ఇక మొత్తం ఏడాది ఏకీకృత నికర లాభం రూ. 20410 కోట్ల నుంచి రూ. 31,676 కోట్లకు పెరిగింది. ఎస్‌బీఐ నికర వడ్డీ ఆదాయం (NII) రూ. 31800 కోట్లు ఉంటుందని మార్కెట్ అంచనా వేయగా, బ్యాంక్ రూ. 31,198 కోట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే నికర వడ్డీ ఆదాయం 15 శాతం పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ 0.29 శాతం పెరిగి 3.4 శాతానికి చేరింది. నికర వడ్డీ ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలను కలిపితే బ్యాంక్ ఈ త్రైమాసికంలో రూ. 82,613 కోట్ల మొత్తం ఆదాయం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 81,327 కోట్లు. అంటే ఆదాయంలో పెరుగుదల లేదు.. కాని ప్రొవిజన్స్ తగ్గడం వల్ల లాభం భారీగా పెరిగిందన్నమాట. రానీ బాకీల పద్దు కింద గత ఏడాది నాలుగో త్రైమాసికంలో రూ. 9914 కోట్లు ప్రొవిజన్ ఏర్పాటు చేయగా, ఈ సారి కేవం రూ. 3262 కోట్లు మాత్రమే చేసింది. అంటే మూడో వంతు తగ్గిందన్నమాట. వీటిలతో పాటు మొత్తం ప్రొవిజన్స్ రూ. 11,051 కోట్ల నుంచి రూ. 7237 కోట్లకు తగ్గాయి. బ్యాంక్ షేరుకు రూ. 7.10 డివిడెండ్ సిఫారసు చేసింది. ఇవాళ ఎస్‌బీఐ షేర్ 1.17 శాతం పెరిగి రూ. 467.85 వద్ద ముగిసింది.