ఎస్బీఐ పనితీరు సూపర్
సెప్టెంబర్ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎస్బీఐ పనితీరు మార్కెట్ వర్గాల అంచనాను మించింది. ఈ మూడు నెలల్లో బ్యాంక్ రూ. 7,626 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలోని నికర లాభంతో పోలిస్తే 66.7 శాతం పెరిగింది. బ్యాంక్ నికర లాభం ఇంకా బాగా పెరిగేదని.. అయితే ఈ త్రైమాసికంలో ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ కోసం రూ. 7,418 కోట్లను కేటాయించాల్సి వచ్చిందని ఎస్బీఐ పేర్కొంది. కంపెనీ ఎన్పీఏలు కూడా 5.32 శాతం నుంచి 4.9 శాతానికి తగ్గాయి. నికర వడ్డీ ఆదాయం (రుణాలపై వడ్డీ, డిపాజిట్ల మధ్య వ్యత్యాసం) 29 శాతం పెరిగి రూ. 31,183 కోట్లకు చేరింది. మార్కెట్ మాత్రం రూ. 28,912 కోట్లు మాత్రమే ఉంటుందని అంచనా వేశారు. బ్యాంక్ షేర్ 1.6 శాతం పెరిగి రూ. 530కి చేరింది.