For Money

Business News

భాసిన్‌ బెట్స్ – టార్గెట్‌ ఎంతంటే?

ఉదయం దాదాపు వంద పాయింట్లు నష్టపోయిన నిఫ్టి ఇక గ్రీన్‌లోకి రావడమే తరువాయి. దాదాపు నష్టాలన్నింటి పూడ్చుకుంది. దిగువస్థాయిలో మార్కెట్‌కు గట్టి మద్దతు లభించింది. మార్కెట్‌కు కాస్త మద్దతు లభించినా 17000ని క్రాస్‌ చేయడం ఖాయమని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ నిన్న టాటా మోటార్స్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ను రెకమెండ్‌ చేశారు. ఇవాళ మరో రెండు షేర్లను సిఫారసు చేశారు. నిఫ్టి కాస్త ఇటూ ఇటూ ఉన్నా… నిఫ్టి మిడ్‌ క్యాప్‌ మాత్రం చాలా పటిష్ఠంగా ఉందని ఆయన అంటున్నారు. అందుకే రెండు మిడ్‌ క్యాప్‌ షేర్లను సిఫారసు చేస్తున్నారు. ఇందులో ఒకటి కెమకల్స్‌ కంపెనీ ఎస్‌ఆర్‌ఎఫ్‌. సోడా యాష్‌, స్పెషాలిటి కెమిలక్స్‌ రంగం బ్రహ్మాండంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఉత్పత్తుల ధరలను ఈ కంపెనీ పెంచిందని, కంపెనీ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని భాసిన్‌ అంటున్నారు. కరోనా తగ్గి చైనాలో సాధారణ పరిస్థితులు వస్తున్నాయని… ఈ కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్‌ బాగా ఉంటుందని అంటున్నారు. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 2455 వద్ద ట్రేడవుతోంది. రూ. 2375 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను రూ. 2750 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. ఇక ఆయన సిఫారసు చేసిన మరో షేర్‌ భారత్‌ ఫోర్జ్‌. కళ్యాణి గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ కూడా అద్భుత పలితాలు ప్రకటించింది. ఆటో, ఫోర్జింగ్‌ రంగంలో ఈ కంపెనీ బాగా రాణిస్తుందని.. అమెరికా నుంచి ఆర్డర్లు పెరుగుతాయని ఆయన అన్నారు. దేశీయంగా కూడా ఆటో రంగం నుంచి డిమాండ్‌ భారీగా ఉండే అవకాశముందని ఆయన అంటున్నారు. భారత్ ఫోర్జ్‌ మార్కెట్‌లో రూ. 709.30 వద్ద ట్రేడవుతోంది. రూ. 685 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ను రూ. 750 టార్గెట్‌ కోసం కొనుగోలు చేయొచ్చని ఆయన చెప్పారు. ఒకవేళ ఇన్వెస్టర్ల దగ్గర ఓపిక ఉంటే మూడు, నాలుగు నెలల్లో ఈ షేర్‌ రూ. 850 నుంచి రూ. 900 దాకా వెళ్ళే అవకాశముందని సంజీవ్‌ భాసిన్‌ అంటున్నారు.