For Money

Business News

రూబుల్‌ ఢమాల్‌.. స్టాక్‌ ఎక్స్ఛేంజీ క్లోజ్‌

ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో రష్యా చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. షేర్ మార్కెట్ సూచీ సగానికి పడిపోగా, రష్యా కరెన్సీ రూబుల్‌ సోమవారమే 30 శాతం వరకు క్షీణించింది. దీంతో వెంటనే డిపాజిట్లపై వడ్డీ రేట్లను రష్యా సెంట్రల్‌ బ్యాంక్‌ పెంచింది. ఏకంగా 9.5 శాతం నుంచి 20 శాతం చేసింది. మరోవైపు రూబుల్‌ను కాపాడేందుకు వీలుగా మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీని మూసేసింది. విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా రష్యా షేర్లను అమ్ముతుండటమే దీనికి కారణం. రష్యాపై అనేక దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధిస్తున్నందున… రష్యా మార్కెట్‌ నుంచి బయటపడేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. షేర్లు అమ్మిన వెంటనే వారు డాలర్లను డిమాండ్‌ చేస్తున్నారు. ఒక్కసారిగా డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూబుల్ మరింత క్షీణిస్తోంది. ఈ పరిస్థితి నివారించేందుకు మాస్కో స్టాక్‌ ఎక్స్ఛేంజీని మూసేశారు. మంగళవారం కూడా ఎక్స్ఛేంజీని తెరిచే అవకాశం లేదని, బుధవారం పరిస్థితి చూసి ట్రేడింగ్ సమయం వెల్లడిస్తామని రష్యా ఆర్థిక శాఖ వెల్లడించింది. అలాగే రష్యా షేర్లను, పెట్టబడులను అమ్మేందుకు విదేశీ ఇన్వెస్టర్లు, విదేశీ సంస్థలు పెట్టిన ఆర్డర్లను కూడా క్యాన్సిల్‌ చేయాల్సిందిగా బ్రోకర్లకు ఆదేశాలు ఇచ్చింది. ఇపుడు అందరి దృష్టి రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య బెలారస్‌లో జరుగుతున్న చర్చలపై పడింది.