ముకేష్‌ను దాటనున్న అదానీ?
భారతదేశంలో అతి పెద్ద కోటీశ్వరుడి స్థానం కోసం ఇద్దరు గుజరాతీల మధ్య పోటీ పెరుగుతోంది. 2015లో కేవలం కొన్నిరోజులు మాత్రమే దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీని సన్ ఫార్మా అధినేత దిలీప్ సంఘ్వి దాటారు. దశాబ్దాల నుంచి ముకేష్ అంబానీదే నంబర్ వన్ స్థానం. కాని ప్రధానిగా మోడీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరవాత
గౌతమ్ అదానీ గ్రూప్ సంపద అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. బీజేపీ అధికారంలో ఉన్న, బీజేపీ అనుకూల పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పలు కీలక సహజ సంపదలను, అనేక ముఖ్యమైన రంగాల్లో మార్కెటింగ్ లేదా డిస్ట్రిబ్యూషన్ హక్కులను అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకుంది. కొన్ని రంగాల్లో ఆ గ్రూప్‌పై ఎన్నిరకాల ఆపరోపణలు వచ్చినా ఎక్కడా విచారణ జరిగినట్లు లేదు. కేసులు పెట్టినా కోర్టుల్లో అవి నానుతున్నాయి. గౌతమ్ అదాని ఎంత స్పీడ్‌గా ఎదిగారంటే ఇపుడు ఆయన మొత్తం సంపద సుమారు రూ. 6,54,000 కోట్లకు చేరింది. దశాబ్దాల నుంచి ఆయిల్, రిఫైనరీ రంగంలో ఉన్న ముకేష్ అంబానీ సంపద చాలా నెమ్మదిగా పెరుగుతూ వచ్చింది. టెలికాంతో పాటు రీటైల్ రంగంలోకి ప్రవేశించడంతో ముకేష్ సంపద పెరిగినా..స్పీడ్ తక్కువే. తాజా లెక్కల ప్రకారం ముకేష్ అంబానీ సంపద విలువ రూ.7,07,250 కోట్లు. గత ఏడాది
కాలంలో ముకేష్ అంబానీ సంపద రూ. 1,32,000 కోట్లు పెరిగితే… గౌతమ్ అదానీ గ్రూప్ సంపద రూ. 4,01,250 కోట్లు పెరిగింది. ఇపుడు ముకేష్‌కు, అదానీకి మధ్య గ్యాప్ కేవలం రూ.53,000 కోట్లు మాత్రమే. కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కారణంగా ఇవాళ మార్కెట్‌లో అన్ని రకాల షేర్లు తగ్గాయి. అలాగే అదానీ షేర్ల విలువ కూడా తగ్గింది. అయితే సౌదీ ప్రభుత్వ కంపెనీ ఆరామ్‌కోతో రిలయన్స్ డీల్ విఫలం కావడంతో ఆ షేర్ కూడా ఇవాళ భారీగా క్షీణించింది. లేకుంటే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగేది. సంపద పెరగడంలో, తగ్గడంలోనూ ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు. అయితే ఈ పోరులో అదానీదే పైచేయి అవుతుందని… ముకేష్ అంబానీని దాటుతారని స్టాక్ మార్కెట్ వర్గాలు అంటున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో మరి…