బియ్యం ఎగుమతులపై నిషేధం
అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే విదేశాలకు లోడ్ అయిన బియ్యానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. నాన్ బాస్మతీ బియ్యం ఎగుమతులను నిషేధిస్తూ కేంద్రం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) నోటీఫికేషన్ విడుదల చేసింది. దీంతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే బియ్యంలో 80 శాతంపై ప్రభావం ఉంటుంది. దేశీయంగా గత కొన్ని నెలలుగా బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ఈ ఏడాది ఉత్తరాదిలో భారీ వర్షాలు, దక్షిణాదిలో అనావృష్టి కారణంగా వరి దిగుబడి తగ్గే అవకాశముందని భారత అధికారులు భావిస్తున్నారు. అలాగే వరి పండించే ప్రధాన దేశాల్లో కూడా దిగుబడి తగ్గనుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బియ్యం ధరలు పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా వియత్నాంకు మన దేశం నుంచి భారీగా బియ్యం దిగుమతి అయింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెల్ల బియ్యం ఎగుమతి నిషేధం విధించింది. ఇందులో సెమీ మిల్డ్, ఫుల్లీ మిల్డ్, పాలిష్ చేసిన బియ్యంతో పాటు పాలిష్ చేయమని బియ్యం ఎగుమతులపై కూడా నిషేధం విధించారు.