For Money

Business News

మండుతున్న వంటనూనెల ధరలు

పండుగల సీజన్‌లో వంటనూనెల ధరలు మండుతున్నాయి. ముఖ్యంగా ఆవనూనె ధర ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి పెరిగింది. ఆవనూనె సగటు ధర కిలోకు రూ. 184.15లకు చేరినట్లు ప్రభుత్వమే నిన్న ప్రకటించింది.ముంబై, లక్నో వంటి ప్రధాన మార్కెట్లలో ధర రూ.200 దాటినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార,ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ లెక్క ప్రకారం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఆవనూనె ధర 43 శాతం పెరిగింది. ఆవనూనె పూర్తిగా దేశీ నూనె అని.. దిగుమతికి ఆస్కారం లేనందున ధరలు భారీగా పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. వేరు శనగనూనె ధర రూ.182.61, వనస్పతి ధర రూ. 136.59, సోయా నూనె రూ. 155, పొద్దుతిరుగుడు నూననె రూ. 169.53, పామాయిల్‌ ధర రూ. 132.91 ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇవన్నీ ప్రభుత్వ సగటు ధరలు.. వాస్తవానికి కీలక మార్కెట్లలో వీటి ధరలు చాలా అధికంగా ఉన్నాయి. ఉదాహరణకు నిన్న ఆవనూనెకు చెప్పిన లెక్కనే చూద్దాం. ఒక మార్కెట్‌లో ఆవనూనె ధర రూ. 224 ఉండగా, మరో మార్కెట్‌లో రూ.117 ఉందని చెప్పింది. అంటే సగటు ధర రూ.170 అని లెక్క. కాని మెజారిటీ మార్కెట్లలో ధర రూ. 224 ఉంది.
గరిష్ఠంగా తగ్గింది 2 శాతం
ఇతర వంటనూనెల ధరలు తగ్గడం ప్రారంభమైందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం గత నెల రోజుల్లో వంట నూనెల ధరలు ధరలు 0.26 శాతం నుంచి 1.7 శాతం వరకు తగ్గాయి. గరిష్ఠ తగ్గింపు 2 శాతం కూడా లేదన్నమాట. నిజానికి మార్కెట్‌లో పరిస్థితి అలా లేదని వినియోగదారులు అంటున్నారు. ప్రభుత్వం వివిధ సెంటర్లలోని సగటు ధరల సగటు చెబుతోందని వీరు చెబుతున్నారు.