For Money

Business News

సింహపురి ఎనర్జీని అమ్మొద్దు

తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్‌ ఇన్‌ఫ్రా సంస్థ సింహపురి ఎనర్జీ లిమిటెడ్‌ని అమ్మాలన్న తాజా ప్రతిపాదనకు హైదరాబాద్‌ హైకోర్టు బ్రేక్‌ వేసింది. తమ కంపెనీ విలువను తగ్గించి విక్రయించాలన్న బ్యాంకుల ప్రతిపాదనపై మధుకాన్‌ గ్రూప్‌ హైకోర్టుని ఆశ్రయించింది. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ కింద రూ. 800 కోట్లు చెల్లిస్తామని తాము చేసిన ప్రతిపాదన కాదని… రూ.335 కోట్లకే బ్యాంకులు లిక్విడేషన్‌ కింద అమ్మడాన్ని సింహపురి ఎనర్జి వ్యతిరేకింది. వాదనలు విన్న హైకోర్టు అమ్మకంపై స్టే విధించింది. 600 మెగావాట్ల ఈ థర్మల్‌ సంస్థలో మధుకాన్‌ గ్రూప్‌నకు 80.78 శాతం వాటా ఉంది. ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి ఈ కంపెనీ రూ. 3250 కోట్ల రుణాలు తీసుకుంది. కంపెనీ రూ. 2054 కోట్లను తిరిగి చెల్లించింది. ఏపీ డిస్కమ్‌లు ఈ కంపెనీని నుంచి విద్యుత్‌ కొనుగోలు చేయకపోవడంతో ప్లాంట్‌ పనిచేయలేదు. దీంతో రుణాలను చెల్లించకలేకపోయింది. దీంతో లిక్విడేషన్‌ ప్రక్రియ ద్వారా నిర్ధారించిన విలువకు విక్రయించేందుకు బ్యాంకులు ప్రయత్నించారు. లిక్విడేషన్‌ ప్రక్రియలో కంపెనీ విలువను రూ.335 కోట్లుగా నిర్ణయించారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ ద్వారా రూ.800 కోట్లు ఇస్తామన్న ప్రతిపాదనను అంగీకరించకుండా, రూ.335 కోట్లకు విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ మధుకాన్‌ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ జి.రాధారాణి ధర్మాసనం.. లిక్విడేషన్‌ విలువకు సింహపురి ఎనర్జీ విక్రయంపై స్టే విధించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.