ఫ్యూచర్ నిర్వహణ రిలయన్స్ చేతికి
ఒకవైపు కోర్టులో ఫ్యూచర్ గ్రూపు వివాదం నడుస్తుండగా…పరోక్షంగా ఆ కంపెనీ నిర్వహణను తన చేతికి తెచ్చుకుంది రిలయన్స్ రీటైల్. రిలయన్స్-ఫ్యూచర్ మధ్య ఒప్పందంపై అమెజాన్ కోర్టుకు వెళ్ళిన విషయం తెలిసిందే. తనకు తెలియకుండా ఫ్యూచర్‌ను రిలయన్స్ కొనడంపై ఆగ్రహంగా ఉంది అమెజాన్. రిలయన్స్ సంస్థ సుమారు పాతిక వేల కోట్ల రూపాయాలకు ఫ్యూచర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ డీల్ మధ్యలో ఆగిపోయింది. ఈ వివాదం తలెత్తె సమయానికి దేశవ్యాప్తంగా ఫ్యూచర్ గ్రూప్‌కి 1700 అవుట్‌లెట్స్ ఉన్నాయి. ఈలోగా ఫ్యూచర్ గ్రూప్ ఆధీనంలో ఉన్న షాపుల లీజు అగ్రిమెంట్లు ముగుస్తున్నాయి. తమకు లీజు బకాయిలు చెల్లించాలంటూ మాల్స్/భవనాల యజమానుల నుంచి ఒత్తిడి వస్తోంది. ఫ్యూచర్ ఆధీనంలో ఉన్న బిగ్‌బజార్ ఔట్లెట్లలో వ్యాపారం మందగించింది. ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. దీంతో రిలయన్స్ గ్రూప్ మరో ఆలోచన చేసింది. ఫూచర్స్ గ్రూప్ తరఫున రిలయన్స్ కంపెనీ అద్దెలు, బకాయిలు చెల్లించింది. ఇప్పటివరకు రూ.1500 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఇలా 200 స్టోర్లను స్వాధీనం చేసుకుని బిగ్ బజార్‌తో పాటు ఇతర షాపుల్లో రిలయన్స్ రీటైల్ బ్రాండ్లను అమ్మడం ప్రారంభించారు.