దశాబ్దం తరవాత రియాల్టీ షేర్లకు జోష్
షేర్ మార్కెట్లో దాదాపు పదేళ్ళ పాటు ఇన్వెస్టర్లు రియాల్టి షేర్లను పట్టించుకోలేదు. బంగారం, నిఫ్టి, ఫార్మా, ఐటీ రంగాల తరవాత ఇపుడు ఇన్వెస్టర్ల దృష్టి రియాల్టిపై పడింది. అన్ని రకాల వస్తువులు, సేవల ధరలు గణనీయంగా పెరిగినా.. రియాల్టి షేర్లలో పెద్దగా మార్పు లేదు. వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో… కరోనా తగ్గుముఖం పట్టినందున… రియాల్టి రంగానికి డిమాండ్ పెరుగుతుంది. ఎగుమతి మధ్య తరగతి ప్రజలు విశాలమైన ఇంటి కోసం, ఇండిపెండెంట్ ఇళ్ళకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పెట్టుబడికి కూడా రియాల్టి రంగం మంచి అవకాశంగా చాలా మంది అనలిస్టులు సలహా ఇస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరవాత రియాల్టికి చాలా గట్టి డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో రియాల్టి షేర్లకు భారీ డిమాండ్ కన్పిస్తోంది. గత రెండు వారాల్లో అనేక రియాల్టి షేర్లు గ్రీన్‌లో ఉంటున్నాయి. శోభా డెవలపర్స్ వంటి షేర్లు కేవలం రెండు వారాల్లో 22 శాతం పెరగ్గా, సన్‌టెక్ రియాల్టి కూడా 20 శాతం దాకా పెరిగింది.ఈ షేర్లను చాలా మంది బ్రోకర్లు రెకమెండ్ చేస్తున్నారు. ఇటీవల పది శాతంపైగా పెరిగిన షేర్లలో బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజస్, ఒబెరాయ్ రియాల్టి, మాక్రోటెక్ డెవలపర్స్, డీఎల్ఎఫ్ ఉన్నాయి. ఈ రంగంలో రారాజుగా ఉన్న గోద్రెజ్ ప్రాపర్టీస్ కూడా 8 శాతం పైగా పెరగడం విశేషం. అలాగే మహీంద్రా లైఫ్‌స్పేస్ కూడా 9 శాతంపైగా పెరిగింది. గడచిన రెండు వారాల నుంచి రియాల్టి షేర్లలో ట్రేడింగ్ బాగా పెరిగిందని, ధరలతో పాటు డెలివరి వాల్యూమ్ కూడా పెరిగిందని మోతిలాల్ ఓస్వాల్‌కు చెందిన విశ్లేషకుడు చందన్ తపారియా అంటున్నారు. ఇండియా బుల్స్ రియాల్టికి కూడా ఇటీవల కొనుగోలుదారులు పెరిగారు.