ఆస్తి అంటే రియల్ ఎస్టేటే!
సగటు పొదుపుదారులు… ఆస్తి అంటే ఇప్పటికీ రియల్ ఎస్టేట్గానే భావిస్తున్నారు. దేశంలో దాదాపు ఏడేళ్ళలో ఎన్నడూ లేనంత డిమాండ్ వస్తోంది హౌజింగ్ సేల్స్‌కు. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై-ఎంఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణె నగరాల్లో అనరాక్ అనే ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ జరిపిన సర్వే ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి-మార్చిలో ఈ నగరాల్లో ఇళ్ళ అమ్మకాలు 71 శాతం పెరిగి 99,550 యూనిట్లకు చేరాయని అనరాక్ పేర్కొన్నది. 2015 నుంచి గమనిస్తే ఓ త్రైమాసికంలో ఈ స్థాయిలో గృహాల అమ్మకాలు జరగడం ఇదే తొలిసారి అని కూడా పేర్కొంది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 58,290 యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. ఇక అక్టోబర్-డిసెంబర్లో 90,860 యూనిట్లుగా ఉన్నాయని పేర్కొంది. గృహ రుణాలపై చౌక వడ్డీరేట్లు, సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న పట్టుదల అందరిలో పెరగడం వంటివి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు కలిసొచ్చాయని పేర్కొన్నది.
‘రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిపోయింది. త్రైమాసిక ఇళ్ళ అమ్మకాలు గడిచిన ఏడేండ్లలోనే గరిష్ఠ స్థాయిలో నమోదయ్యాయి. ధరలు పెరుగుతున్నా.. డిమాండ్ తగ్గకపోవడానికి కారణాలు ఇవే. పూర్తయ్యి ఇంకా అమ్ముడుపోని ఇండ్ల సంఖ్య కూడా సుమారు 2 శాతం తగ్గింద’ని అన్‌రాక్ సంస్థ పేర్కొంది. అనరాక్ విడుదల చేసిన తాజా నివేదికలో హైదరాబాద్‌లో ఇండ్ల అమ్మకాలు గతంతో చూస్తే పెద్ద ఎత్తున పెరిగాయని తేలింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో హైదరాబాద్‌సహా ఏడు నగరాల్లో జరిగిన హౌజింగ్ సేల్స్ వివరాలను అనరాక్ ప్రకటించింది. ఇందులో దాదాపు 200 శాతం వృద్ధితో 13,140 యూనిట్ల విక్రయాలు హైదరాబాద్‌లో జరిగినట్టు వెల్లడైంది. కొత్త ఇళ్ళ నిర్మాణాల్లోనూ ఈ నగరాల్లో 43 శాతం వృద్ధి కనిపించింది. నిరుడుతో చూస్తే 62,130 యూనిట్ల నుంచి 89,150 యూనిట్లకు పెరిగాయి.