త్వరలోనే ప్రయోగాత్మకంగా ఈ రూపీ
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)పై కాన్సెప్ట్ పేపర్‌ను భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఇవాళ విడుదల చేసింది. డిజిటల్ కరెన్సీలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు దీన్ని ఉద్దేశించారు. అలాగే భవిష్యత్తులో డిజిటల్ రూపీ ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఎంపిక చేసిన కొన్ని లావాదేవీలకు త్వరలోనే ఈ రూపీ(e rupee)ని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఈ పైలెట్ ప్రాజెక్టు విస్తరించే కొద్దీ… దీని ప్రత్యేక ఫీచర్స్‌ను, ప్రయోజనాలను ఎప్పటికపుడు ప్రజలకు ఆర్బీఐ వివరిస్తుంది. డబ్బు విషయంలో ఇపుడున్న కరెన్సీతో పాటు అదనపు ఆప్షన్స్‌ను కూడా ఈ రూపీ అందిస్తుందని ఆర్బీఐ పేర్కొంది. ఇది బ్యాంకు నోట్లకు భిన్నమైనది కాదని, అయితే డిజిటల్ కావడంతో వీటి ఉపయోగం సులభంగా, త్వరగా, చౌకగా ఉండే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. ఇతర డిజిటల్ కరెన్సీల మాదిరిగానే అన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది.