షేర్ 15 శాతం జంప్
ఇవాళ స్టాక్ మార్కెట్ డల్‌గా ఉన్నా రెయిన్బో హాస్పిటల్స్ ( రెయిన్బో చిల్డ్రన్స్ మెడికేర్ లిమిటెడ్) దుమ్ము రేపుతోంది. కంపెనీ ప్రకటించిన ఫలితాలు మార్కెట్‌ను ఆకట్టుకున్నాయి. దీంతో షేర్ ధర 15 శాతం పెరిగి రూ. 531.50ని తాకింది. మార్కెట్లో బ్యాంకు, హాస్పిటల్ రంగానికి మంచి భవిష్యత్తు ఉంటుందని మార్కెట్ అనలిస్టులు సలహా ఇస్తున్న సమయంలో రెయిన్బో హాస్పిటల్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ .237.15 కోట్ల ఆదాయంపై రూ. 38.76 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హాస్పిటల్ రూ.12.26 కోట్ల నికర లాభం మాత్రమే ఆర్జించింది. కంపెనీ నికర లాభం భారీగా పెరగడంతో ఇవాళ స్టాక్ మార్కెట్లో ఈ కౌంటర్లో భారీ కొనుగోళ్ళ ఆసక్తి వచ్చింది. ఈ షేర్ ఇపుడు రూ. 525.80 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో కొత్త ఆసుపత్రిని ప్రస్తుత త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో వచ్చే త్రైమాసికంలో హాస్పిటల్ పనితీరు మరింత ప్రోత్సాహకరంగా ఉండే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.