రెయిన్ బో హాస్పిటల్ నుంచి IPO
హైదరాబాద్‌కు చెందిన మరో హాస్పిటల్ పబ్లిక్ ఇష్యూ రానుంది. ప్రముఖ పిల్లల ఆసుపత్రి రెయిన్ బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీఓ కోసం సెబీ వద్ద ప్రాస్పక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీఓలో భాగంగా తాజా షేర్లను జారీ చేయడం ద్వారా రూ. 280 కోట్లు సమీకరించనుంది. అలాగే ఇపుడున్న ఇన్వెస్టర్లు కూడా తమ వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నారు. వీరు 2.4 కోట్ల షేర్లను అమ్ముతున్నట్లు కంపెనీ తెలిపింది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా కంపెనీ ప్రమోటర్లైన రమేష్ కంచర్ల, ఆదర్శ్ కంచర్ల, దినేష్ కుమార్ చిర్లలతో పాటు ఇన్వెస్టర్ సీడీసీ గ్రూప్, సీడీసీ ఇండియా సంస్థలు కూడా తమ వాటాలను విక్రయించనున్నాయి. ఆఫర్లో కంపెనీ ఉద్యోగులకు మూడు లక్షల షేర్లను కేటాయిస్తారు. ఇష్యూ ద్వారా సమకూరే నిధులతో కంపెనీ విస్తరణతో పాటు ఆధునిక ఎక్విప్మెంట్ కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం రెయిన్ బో బ్రాండ్ కింద ఆరు నగరాల్లో… పధ్నాలుగు ఆసుపత్రులు, 3 క్లినిక్‌లు ఉన్నాయి. మొత్తం కంపెనీకి 1500 బెడ్స్ ఉన్నాయి. గత మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 719 కోట్ల టర్నోవర్‌పై రూ.39.56 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఆరునెలల్లో హాస్పిటల్ రూ. 512 కోట్ల టర్నోవర్‌పై రూ. 81.22 కోట్ల నికర లాభాన్ని హాస్పిటల్ ఆర్జించింది.