రష్యా చౌక ఆయిల్‌తో రిలయన్స్, నయారాకు లబ్ది!
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా నుంచి భారత్ చౌక ధరకు ముడి చమురు దిగుమతి చేసుకోవడాన్ని కొన్ని యూరప్ దేశాలు ఖండించాయి. కొన్ని గల్ఫ్ దేశాలు గుర్రుగా ఉన్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇ్రమాన్ ఖాన్ ఇదే విషయమై మాట్లాడుతూ… తమ దేశ ప్రజల కోసం అమెరికాను ఎదురించి రష్యా నుంచి మోడీ ప్రభుత్వం ముడి చమురు దిగుమతి చేసుకుంటోందని అన్నారు. అయితే వాస్తవంలో రష్యా నుంచి ముడి చమురును చౌకగా దిగుమతి చేసుకోవడం వల్ల భారత దేశ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం కల్గలేదని.. దీనివల్ల బాగుపడింది రిలయన్స్, రష్యా కంపెనీ నయారా ఎనర్జి అని తేలింది. దీనికి సంబంధించి ద ప్రింట్ వెబ్సైట్ ఓ ప్రత్యేక కథనం రాసింది. దీన్ని రాసింది ప్రవీణ్ చక్రవర్తి. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్, సీనియర్ ఆర్థికవేత్త అయిన ప్రవీణ్ చక్రవర్తి తన వ్యాసంలో చాలా డేటాను కూడా ఇచ్చారు.ఆ డేటా ఆధారంగా రష్యా నుంచి చౌకగా దిగుమతి అవుతున్న ముడి చమురు కోటీశ్వరులకు ఉపయోగపడిందే కాని.. భారత ప్రజలకు కాదని వివరించారు.
ఇంకా ఆయన ఏమి రాశారంటే….
ఉక్రెయిన్ యుద్ధ సమయం నుంచి భారత్ 30 శాతం పైగా డిస్కౌంట్‌తో ముడిచమురు దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో అంటే ఏడునెలల్లో చమురు దిగుమతి కోసం రష్యాకు భారత్ 2000 కోట్ల డాలర్లు చెల్లించిందని ప్రనవీణ్ చక్రవర్తి వివరించారు. గడచిన పదేళ్ళలో రష్యాకు మనం చెల్లించిన మొత్తం కలిపినా ఇంత లేదన్నారు. ఇదంతా దేశ ప్రజల కోసమని మోడీ అన్నారు. నిజానికి రష్యా నుంచి క్రూడ్ దిగుమతి చేసుకున్నా పైసా కూడా ప్రజలకు తగ్గించలేదని.. కొన్ని నెలల నుంచి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు.
కాని రిలయన్స్, రష్యా ప్రభుత్వ కంపెనీ నయారా ఎనర్జి(ఎస్సార్ ఆయిల్‌ను ఈ కంపెనీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే) కంపెనీలు రష్యా నుంచి డిస్కౌంట్ ధరకు ముడి చమురు కొనుగోలు చేసి… భారత్‌లో రిఫైన్ చేసి యూరప్ దేశాలకు అమ్ముతున్నాయి. రిలయన్స్ ముడి చమురు కొనుగోళ్ళలో ఇపుడు రష్యా ఆయిల్ మూడో వంతు అంటే 33 శాతం ఉంది. అంతకమునుపు అయిదు శాతం కూడా ఉండేది కాదు. ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీలు రష్యా నుంచి చాలా తక్కువ మొత్తంలో కొనుగోలు చేశాయి. రిలయన్స్, నయారాలో భారత మార్కెట్లో పెట్రోల్, డీజిల్‌ను ప్రభుత్వం నిర్ణయించిన అంటే అధిక దరలకే అమ్ముతూ లాభాలు గడిస్తున్నాయి. మరోవైపు చౌకగా రష్యా నుంచి తెచ్చి… రిఫైన్ చేసి అధిక ధరలకు యూరప్ దేశాలకు అమ్ముతున్నాయి. సీఎన్ఎన్ టీవీ ఛానల్ మన కేంద్ర మంత్రి హర్దీప్ పూరి మాట్లాడుతూ… మేము రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని అన్నారు. అంటే దేశం కోసం కొంటున్నామని అన్నారు. ఇదే విషాయన్ని సీఎన్ఎన్ రిపోర్టర్ మళ్ళీ ప్రశ్నించగా… రష్యా నుంచి ప్రైవేట్ కంపెనీలు ఆయిల్ కొంటున్నాయని అన్నారు. అంటే రష్యా చౌక ఆయిల్ వల్ల ప్రయోజనం కోట్లాది భారతీయులకు లేకుండా మోడీ ప్రభుత్వం చేసిందన్నమాట.