విద్యుత్ సంక్షోభం: ప్రైవేట్ కంపెనీల పండుగ
మన దగ్గర బొగ్గు ఉంది. విద్యుత్తు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అయితే విద్యుత్ సంక్షోభం ఎందుకు వచ్చింది? దాదాపు ఆరు నెలలుగా సంక్షోభం క్రమంగా ముసురుకుంటున్నా ఎందుకు గుర్తించలేకపోయారు? ప్రైవేట్ కంపెనీలతో ప్రభుత్వాలు కుమ్మక్కు అయ్యాయా? కార్పొరేట్ పెద్దలు, ప్రభుత్వ పెద్దలకు … బడా బడా షేర్ మార్కెట్ బ్రోకర్లకూ తెలుసా? ఇపుడు దేశంలో ఉన్న పరిస్థితిని చూస్తే నిజమేనని నమ్మాల్సి వస్తోంది. నిన్న విద్యుత్ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్‌తో మాట్లాడుతూ… దేశంలో బొగ్గు కొరత లేదన్నారు. కేవలం కొన్ని రాష్ట్రాలు బొగ్గు బకాయిలు చెల్లించకపోవడం వల్ల ఆ రాష్ట్రాల్లోనే కొరత ఉందని, వారు బకాయిలు చెల్లిస్తే సమస్య ఉండదని అన్నారు. కోవిడ్ తరవాత పరిశ్రమలు జోరుగా పనిచేయడంతో పాటు దేశ వ్యాప్తంగా వాతావరణంలో మార్పు కారణంగా గృహాల్లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఒక్క యూనిట్ తగ్గినా… ప్రభుత్వాలు ఏం చేస్తాయి? ఓపెన్ మార్కెట్లోఅంటే ఇండియన్ ఎనర్జీ ఎక్స్ఛేంజీలో కొంటాయి. ఇపుడు రాష్ట్రాల సంఖ్య పెరగడంతో ప్రైవేట్ కంపెనీలు రేట్లు పెంచాయి. ఎంతగా అంటే మూడు రెట్లు పెంచాయి? రూ. 4 నుంచి రూ.5 మధ్య ఉన్న రేట్లు ఇపుడు రూ. 14 నుంచి రూ. 16లకు అమ్ముతున్నాయి. నిత్యావసర వస్తువుగా మారిన విద్యుత్‌ను ప్రైవేట్ కంపెనీలు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసి క్యాష్ చేసుకోవచ్చా?
తెలిసే చేస్తున్నారు…
అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యుత్ ప్లాంట్లు ఒక్కొక్కటి మూసేసేలా చేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి కేవలం 50 శాతం మాత్రమే చేస్తున్నారు. అసలు ఆ ప్లాంట్లతో ప్రభుత్వం ఒప్పందమే చేసుకోలేదు. పవన్, సౌర విద్యుత్తును చూసి.. థర్మల్ను మూసేశారు. కాని అకస్మాతుగా కొరత వస్తే ఎలా అనే అంశాన్ని పరిశీలించలేదు. ప్రైవేట్ పవన, సౌర ప్లాంట్లను ప్రోత్సహించిన కేంద్రం థర్మల్ ప్లాంట్లు మూతపడేలా ప్లాన్ చేసింది. అదానీ, రిలయన్స్‌లు ఈ రంగంలో వచ్చే సమయానికి బొగ్గు సరఫరాను ఆపడం ప్రారంభించింది. దీంతో క్రమంగా ఈ రంగం సంక్షోభంలోకి వెళ్ళింది. ఈ పరిస్థితిని పాలకులకు కావాలని తెచ్చారు? ఎందుకు?
అధిక చార్జీలకు అలవాటు పడాలి
ప్రజలకు విద్యుత్ కోసం అధిక చార్జీలు చెల్లించేలా అలవాటు చేయాలి. మున్ముందు రిలయన్స్, అదానీ, టాటాలే ఉంటాయి కాబట్టి.. వాటికి అధిక ధర చెల్లించేందుకు జనం అలవాటు పడాలి.
ఇపుడు ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నదీ అదే. ఉత్పత్తి వ్యయం పెరగనప్పడు… ఈ కంపెనీలు ధరలు ఎలా పెంచుతున్నాయి? ప్రభుత్వానికి దీనిపై నియంత్రణ లేదా? కేవలం నెలలో స్పాట్ మార్కెట్లో కరెంటు ధర మూడు రెట్లు పెరిగిందని ఏపీ ట్రాన్స్‌కో ఎండీ అంటున్నారు? ఉద్దేశ పూర్వకంగానే బకాయిలను సాకుగా చూపి బొగ్గు సరఫరా ఆపారు. డిమాండ్ పెరిగేసరికి ఎవరికివారు సాకులు వెతుక్కుంటున్నారు. ఏపీ వంటి రాష్ట్రం రోజు కోటి యూనిట్లు మూడు రెట్లు అధిక ధర పెట్టి కరెంటు కొంటోంది. పక్కా ప్లాన్‌తో ప్రైవేట్ కంపెనీలకు కనక వర్షం కురిపిస్తున్నారు.
ప్రైవేట్ కంపెనీల జోరు
స్పాట్ మార్కెట్లో కరెంట్ అమ్మే ఇండియన్ ఎనర్జి ఎక్స్ఛేంజీ షేర్ నిన్న ఒక్క రోజే 14 శాతం పెరిగింది. కొని, అమ్మడంలో కమీషన్ ఈ సంస్థ బాగానే ఆర్జిస్తుంది. ఇక టాటా పవర్ 9 శాతం పెరిగింది.టొరెంట్ పవర్ 6 శాతం పెరిగింది. ఐనాక్స్ విండ్, ఊర్జా గోబల్, సుజ్లాన్ ఎనర్జి, ఏబీబీ పవర్, హోండా ఇండియా పవర్ పొడక్ట్స్, ఎంసీటీసీ, బొరొసిల్ రెన్యూవబుల్ షేర్లు నిన్న 16 శాతం వరకు పెరిగాయి. గడచిన ఆరు నెలల్లోనే ఈ కంపెనీ షేర్లు 40 శాతం నుంచి 50 శాతం పెరిగాయి. బ్లూచిప్ కంపెనీల షేర్లు వంద శాతం పెరిగాయి. కోవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో, డిమాండ్ పాత స్థాయికి వెళ్ళడంతో పాటు వ్యవసాయ పనుల కోసం విద్యుత్ పెరుగుతుందని రాష్ట్రాలు గుర్తించలేకపోయాయా?. ముఖ్యంగా గృహాల్లో ఏసీల వినియోగం పెరుగుతోందని విద్యుత్ శాఖ కూడా అంచనా వేయలేకపోయిందా? నిజానికి ఈ మాత్రం డిమాండ్ పెరగడం సహజం. మరెందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు? ప్రైవేట్ కంపెనీల కోసం పాలకులు మిన్నకుండి పోయారా? అన్న అనుమానం కల్గుతోంది. కావాలని విద్యుత్ ప్లాంట్ల ఉత్పత్తిని ఆపేశారా? నిజానికి మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో క్రమంగా ప్రభుత్వ రంగ ప్లాంట్ల వాటా తగ్గించేశారు. దీనికి ఇపుడు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. మొత్తానికి ఈ సంక్షోభం ప్రైవేట్ కంపెనీలకు కనకవర్షం కురిపిస్తోంది. మోడీ ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే.