For Money

Business News

ఇక బడ్జెట్‌ సమావేశాలూ పోయినట్లే?

ఒకవైపు బడ్జెట్‌, మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇవాళ ద న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన వార్త దేశ రాజధానిలో హాట్‌ టాపిక్‌గా మారింది. మోడీ మీడియా దీన్ని దాచే ప్రయత్నం చేస్తున్నా ప్రాంతీయ మీడియా, సోషల్‌ మీడియాలో పెగసస్‌ వివాదం తీవ్ర సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నివేదిక రావడానికి ఇంచా చాలా సమయం ఉంది. ఎందుకంటే జనవరి 2వరకు ఫిర్యాదుల స్వీకరించిన ఈ కమిటీ నివేదిక ఇవ్వడానికి మరి కొంత సమయం పట్టవచ్చు. ఇదే సమయంలో ద న్యూయార్క్‌ టైమ్స్‌లో వచ్చిన కథనాన్ని కూడా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పరిగణనలోకి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నారు.
బడ్జెట్‌ సమావేశాలు
ఈనెల 31న బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమౌతాయి. అదే రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు బడ్జెట్‌ సమావేశాలు సాగుతాయి. పెగసస్‌ వ్యవహారాన్ని పార్లమెంటులోనే తేల్చుకోవాలని కాంగ్రెస్‌ మొదట్నుంచి భావిస్తోంది. కోర్టుకు వెళ్ళడానికి ఆ పార్టీ ఎపుడూ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇపుడు కాంగ్రెస్‌ చేతికి మరో ఆయుధం దొరికింది. పెగసస్‌ నిఘా నిజమేనని ఇవాళ న్యూయార్క్ టైమ్స్‌ రాసి, అంతకుమునుపు సిటిజన్‌ ల్యాబ్‌ చెప్పింది. అమ్నెస్టి టెక్‌ నిర్ధారించి చెప్పింది. ఫ్రెంచ్‌ ప్రభుత్వం నిఘా నిజమని ఒప్పుకుంది. జర్మన్‌ కూడా వాస్తవమని చెప్పింది. అమెరికా ప్రభుత్వం కూడా. చివరికి యాపిల్‌, వాట్సప్‌ సంస్థలు కోర్టులో పెగసస్‌ మాతృసంస్థ ఎన్‌ఎస్‌ఓపై కేసులు కూడా పెట్టాయి. కాని మోడీ ప్రభుత్వం బుకాయిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష పార్టీలన్నీ ఈసారి పార్లమెంటులో మోడీని కార్నర్‌ చేసే అవకాశం అధికంగా ఉంది. ఎన్నికల దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు ఈ విషయంపై గట్టిగా స్పందించే అవకాశముంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు జరగడం కష్టమే. ఈసారి ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉందని సర్వేలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో పెగసస్‌ను మోడీ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.