For Money

Business News

అంతా ‘ఆ అదృశ్య యోగి’ మహిమ

మీరు చదవింది నిజమే. కనిపించిన ఓ పవర్‌ఫుల్‌ యోగి కథ ఇది.
టర్నోవర్‌లో దేశంలోనే కాక ప్రపంచ స్టాక్‌ ఎక్స్ఛేంజీలతో పోటీ పడుతోంది మన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (ఎన్‌ఎస్‌ఈ). గత ఏడాది ఈ ఎక్స్ఛేంజీలో ఒకే రోజు రూ.1.47 లక్షల కోట్ల టర్నోవర్‌ కూడా జరిగింది. ఈ ఎక్స్ఛేంజీలో ట్రేడవుతున్న కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (షేర్ల విలువ) రూ. 300 లక్షల కోట్లు. ఇంత పెద్ద ఎక్స్ఛేంజీకి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా పనిచేసిన చిత్ర రామకృష్ణన్‌ను 2016లో తొలగించారు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె హయాంలో ఏమి జరిగిందో విచారణ జరిపింది సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) దర్యాప్తు బృందం. నివేదికను నిన్న విడుదల చేసింది. 190 పేజీలు ఉన్న ఈ విచారణ నివేదిక చదివితే… నాటి విఠలాచార్య సినిమాలను మైమరిపించే స్టోరీ ఇది. క్షణాల్లో కోట్లలో వ్యాపారం జరిగే ఈ ఎక్స్ఛేంజీని మూడేళ్ళ పాటు ఓ అదృశ్య యోగి నడిపారంటే… ఆశ్చర్యపోతారు. క్లుప్తంగా ఏం జరిగిందో చదవండి.
ప్రారంభం నుంచి…
చాలా క్లుప్తంగా చిత్రా రామకృష్ణన్‌ గురించి చెప్పాల్సివస్తే….. ఆమె వృత్తిరీత్యా ఛార్టెట్‌ అకౌంటెంట్‌. ఐడీబీఐ బ్యాంక్‌లో తొలుత పనిచేశారు. ఎన్‌ఎస్‌ఈ నెలకొల్పడానికి అప్పటి ఐడీబీఐ బ్యాంక్‌ ఛైర్మన్‌ నడ్కకర్ణి ఎంపిక చేసిన కొంత మంది బ్యాంకర్లలో ఈమె ఒకరు. అంచలంచెలుగా ఎదిగిన చిత్ర 2013లో ఎన్‌ఎస్‌ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ), చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (సీఈఓ) అయ్యారు. ఢిల్లీలోని ఓ ప్రముఖ రాజకీయ నేత సాయంతో ఆమె ఈ పదవిలోకి వచ్చారని అంటారు.. తీవ్ర ఆరోపణలు రావడంతో 2016లో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. రోజూ వేల కోట్లలో టర్నోవర్‌ జరిగే ఎన్‌ఎస్‌ఈలో ప్రతి సెకనూ చాలా కీలకం. ముఖ్యంగా ట్రేడింగ్‌ జరిగే సమయంలో లైవ్‌ డేటా సాయంతో కొందరు బ్రోకర్లు కోట్లు సంపాదిస్తారు. అందుకే ఎన్‌ఎస్‌ఈలో సర్వర్‌ ఉన్న బ్రోకర్‌కు, బయట ఆఫీసుల్లో ఉన్న బ్రోకర్ల మధ్య ఎపుడు గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సెకను కన్నా తక్కవ సమయంలోనే డేటా చోరీతో కొందరు కోట్లు సంపాదిస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతటి కీలకమైన ఆఫీసుకు సీఈఓగా ఉన్న చిత్ర రామకృష్ణ తన ఆఫీసు పనుల నిర్వహణ కోసం, సలహాల కోసం హియాలయాల్లో ఉన్న ఓ యోగిని ఆశ్రయించేవారని సెబీ దర్యాప్తులో బయటపడింది. ఆ యోగిని ‘శిరోమణి’ అని చిత్ర పిలుస్తారు. చిత్రను SOM అని యోగి పిలుస్తారు. హిమాలయాల్లో ఉన్న యోగిని ఆమె సిద్ధ పురుష్‌, పరమహంస అని పిలుస్తారు. ఈ విషయాలన్నీ సెబీ దర్యాప్తు కమిటీకి చిత్ర రామకృష్ణన్‌ స్వయంగా చెప్పారు. ఎపుడూ చూడని ఆ యోగితో 20 ఏళ్ళ నుంచి ఆన్‌లైన్‌లో టచ్‌లో ఉన్నట్లు ఆమె చెప్పారు. 2014 నుంచి 2016 వరకు rigyajursama@ outlook.com (referred as ‘unknown person’/ rigyajursama@ outlook.com) ఈమెయిల్ ఐడీతో ఆమె జరిపిన ఈ మెయిల్స్‌ చూసి సెబి దర్యాప్తు బృందం ఖంగుతింది. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన అయిదేళ్ళ పనితీరు అంచనాలు, ఫైనాన్షియల్‌ డేటా, డివిడెండ్‌ రేషియా, బిజినెస్‌ ప్లాన్‌, బోర్డు మీటింగుల అజెండా, చివరికి ఉద్యోగుల పనితీరు మదింపు నివేదికలు కూడా ఆమె యోగికి మెయిల్ చేశారు. అంటే తన ఆఫీసులో ప్రమోషన్‌ ఎవరికి ఇవ్వాలో కూడా యోగి నిర్ణయించారన్నమాట. 2013లో యోగి నుంచి వచ్చిన ఓ మెయిల్‌ను చూసి సెబి దర్యాప్తు బృందం కంగుతింది. స్టాక్‌ మార్కెట్‌లో పెద్దగా పరిచయం లేని ఆనంద్‌ సుబ్రమణియన్‌ అనే వ్యక్తిని ఎన్ఎస్‌ఈ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ)గా నియమించమని ఆ ఈ మెయిల్‌లో ఉంది. పైగా అతనికి ఇచ్చిన జీతం, ఇతర అలవెన్స్‌లు ఎంతో తెలుసా? అక్షరాల రూ.5 కోట్లు. యోగి ఆదేశాల మేరకు అతనికి ప్రమోషన్లు ఇవ్వడమేగాక… తన పక్కనే కేబిన్‌ కూడా కట్టించారు చిత్ర. తాను సీఈఓగా ఉన్నంత వరకు జీతాలు, ప్రమోషన్లు వంటి అంశాలకు సంబంధించి ఎవరిమాట ఆమె వినేవారు కాదు. ఎవరు ఎన్ని నివేదికలు ఇచ్చినా… చివరకు యోగి చెప్పినవారికే ఛాన్స్‌ దక్కేదని ఆమె జరిపిన మెయిల్స్ ద్వారా బయటపడింది. చిత్రమేమిటంటే… ఆమె పనితీరు ఎవరూ ప్రశ్నించకపోవడం. ఎన్‌ఎస్‌ఈకి చెందిన సీనియర్‌ మేనేజర్లు, బోర్డు మెంబర్లు, ప్రమోటర్లు, చివరికి పెద్ద పెద్ద బ్యాంకులు, ఆర్థిక సంస్థల బాస్‌లు కూడా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదని తేలింది. పైగా ఆమెను ఎన్‌ఎస్‌ఈ నుంచి తొలగిస్తే… జీతం, వివిధ బకాయిలు అంటూ ఏకంగా రూ. 44 కోట్లు ఆమెకు ఇచ్చినట్లు సెబీ దర్యాప్తులో బయటపడింది. ఎవరు ఈ యోగీ? మీరు ఎపుడైనా చూశారా? కలిశారా? అంటూ చిత్రను సెబి బృందం ప్రశ్నించింది. అంతగొప్ప ఆధ్మాత్మిక శక్తులు ఉన్నవారు భౌతికంగా మన ముందు వచ్చి నిలబడాల్సిన పనిలేదని చిత్రం సమాధానం చెప్పింది. యోగితో జరిపిన ఈ మెయిల్స్‌ వ్యవహారాలను ఆమె ఖండించలేదని కూడా సెబి నివేదికలో స్పష్టం చేశారు. యోగి సలహాతో నియమితులైన ఆనంద్‌ సుబ్రమణ్యంకు వద్దంటే డబ్బు అన్న స్థాయిలో అలవెలన్సులు, జీతం ఇచ్చారు చిత్ర. నిజానికి ఆనంద్‌ను ఉద్యోగంలో తీసుకోవడానికి పాటించాల్సిన నిబంధనలు ఏవీ పాటించలేదు. నేరుగా చిత్రకు తన సీవీని ఆనంద్ ఇవ్వడం, ఆమోదించడం జరిగిపోయాయని సెబి పేర్కొంది. 2013 జనవరి 18న ఆనంద్‌ను రూ. 1.68 కోట్ల జీతంతో తీసుకున్నారు. (అంతకముందు బాల్మర్‌ లారీ అనే కంపెనీలో ఆనంద్‌ రూ. 15 లక్షలకు పనిచేసేవాడు) ఏడాది పూర్తవగానే 2014 మార్చిలో ఆనంద్‌ జీతాన్ని రూ. 2.01 కోట్లకు పెంచారు. అయిదు వారాలు తిరగకుండానే అతని జీతం 15 శాతం పెంచారు. మళ్ళీ మరో 15 శాతం పెంచారు. ఇలా 2015కల్లా ఆనంద్ జీతం రూ. 5 కోట్లకు చేరినట్లు సెబి గుర్తించింది. ఆనంద్‌ సుబ్రమణ్యంకు ఇవ్వాల్సిన ప్రమోషన్‌, జీతం .. అంతా యోగి ఈమెయిల్స్‌ చలవే. కాంట్రాక్ట్‌ ప్రకారం ఆనంద్‌ వారానికి అయిదు రోజులు రావాలి. కాని వారానికి మూడు రోజులు వస్తే చాలని, మిగిలిన రోజుల్లో ఆయన ఇష్టమని మినహాయింపు కూడా ఇచ్చారు. ఎన్‌ఎస్‌ఈలో ఇతర ఉద్యోగుల విషయంలో కూడా యోగి పాత్ర గురించి సెబీ తన నివేదికలో పేర్కొంది.

నేను అవతారం ఎత్తితే…
2015 సెప్టెంబర్‌ 5న యోగి నుంచి చిత్రకు ఓ మెయిల్‌ వచ్చింది. ‘సోమ్‌ (చిత్ర)… భూమి మీద నేను అవతరం ఎత్తాలని అనుకుంటే.. కంచన్‌ (ఆనంద్‌) కరెక్ట్‌గా సరిపోతాడ’ని అందులో రాసుంది. ఇంకా చిత్రకు, యోగి మధ్య జరిగిన పలు ఈ మెయిల్స్‌ను సెబీ తన నివేదికలో పొందు పర్చింది. చిత్ర, అదృశ్య యోగి మధ్య పెద్ద ‘మనీ మేకింగ్ స్కీమ్‌’ నడించిందని సెబీ అనుమానిస్తోంది. నేరుగా చిత్రపై ఫిర్యాదు చేస్తే ఏం కొంపలు మునుగుతాయేమోనని భయపడిన ఉద్యోగులు… ఎస్‌ఎస్‌ఈకి ఆకాశరామన్న ఉత్తరాలు రాశారని సెబి పేర్కొంది. అన్ని ఆశారామన్న ఉత్తరాలు వచ్చినా… 1913లో చిత్రను ఎండీ, సీఈఓగా నియమించారు. ఎన్‌ఎస్‌ఈ నుంచి తొలగించిన తరవాత చిత్ర, ఆనంద్‌కు సంబంధించిన ల్యాప్‌టాప్‌లను ఈ వేస్ట్‌ కింద అమ్మేశారు. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ కోసం వారి పర్సనల్‌ ఈమెయిల్స్‌ లభించలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో తనకు ఎవరూ, ఏమీ ఫిర్యాదు చేయలేదని చిత్ర సెబీ దర్యాప్తు బృందానికి పేర్కొన్నారు. అప్పట్లో ఎన్‌ఎస్‌ఈ ఛైర్మన్‌గా ఉన్న అశోక్‌ చావ్లా చిత్ర రాజీనామాను ఆమోదించడమే గాక.. ఎన్‌ఎస్‌ఈ అభివృద్ధికి దోహదం చేసినందుకు ఎన్‌ఎస్‌ఈ బోర్డుకు కూడా అభినందించడం విశేషం.

యోగితో చిత్ర ఈమెయిల్స్‌

 

చిత్రతో సెబి బృందం విచారణ