For Money

Business News

కుప్పకూలిన అమెరికా రియల్‌ ఎస్టేట్‌

ఒకవైపు ఐటీ ఉద్యోగాలు పోవడం, ప్రభుత్వం H1B నిబంధనలు కఠినం చేయడంతో పాటు అమెరికాలో వడ్డీ రేట్లు అమాంతంగా పెరగడంతో ఎన్నారైలు రాత్రికి రాత్రి ఇండియాకు వచ్చేస్తున్నారు. అనేక మంది వాయిదాలు కట్టేలేక… తీసుకున్న రుణాలు ముందే కట్టేందుకు సిద్ధమౌతున్నారు. రియల్‌ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టినవారు లబోదిబో అంటున్నారు. వడ్డీ రేట్లు భారీగా పెరగడంతో పాటు ఇళ్ళ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. H1B నిబంధనలు కఠినం చేయడంతో ఇతర దేశాలవారు కూడా అమెరికాకు రావడం లేదు. దీంతో కొత్త ఇళ్ళకు డిమాండ్‌ భారీగా తగ్గింది. దీంతో ధరలు ఈ ఏడాది ఏకంగా 30 శాతం తగ్గినట్లు తెలుస్తోంది. కోవిడ్‌ సమయంలో రియల్‌ ఎస్టేట్‌ పడినపుడు అనేక మంది ఎన్నారైలు ఎగబడి రెండు, మూడు ఇళ్ళు కొన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని సెకండ్‌ హ్యాండ్‌ ఇళ్ళు కూడా భారీగా కొన్నారు. ఇపుడు వాటిని అమ్మలేకపోతున్నారు. పెరిగిన వడ్డీతో వాయిదాలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రతినెలా వాయిదాలు చెల్లించలేకపోతున్నారు. ఇక రుణాలను ముందే వొదిలించుకునేందుకు అంటే ప్రి క్లోజింగ్‌ కోసం దాఖలు చేసిన దరఖాస్తుల ప్రతి నెలా పెరుగుతోంది. టెక్సాస్‌ నగరంలో ఇలాంటి దరఖాస్తుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 43 శాతం పెరిగినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం రాసింది. కాలిఫోర్నియా, టెక్సాస్‌, వాషింగ్టన్‌ డీసీలోని ఎన్నారైలు తమ లోన్లను ముందే క్లోజ్‌ చేస్తున్నారు. ఉద్యోగాలు పోతుండటంతో చాలా మందికి ఏం చేయాలో పాలు పోవడం లేదని ఆ పత్రిక రాసింది. ఇల్లు, కార్లు వొదిలి భారత్‌కు వచ్చేస్తున్న వారి గురించి ప్రత్యేక కథనం రాసింది. 2000లో డాట్‌కామ్‌ క్రాష్‌, 2008 ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు ఇపుడు అమెరికాలో ఉన్నాయని చాలా మంది ఎన్నారైలు అంటున్నారు. 20 ఏళ్ళ అనుభవం ఉన్నవారికి కూడా ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతోందని కొందరు ఎన్నారైలు అంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ ద్వారా భారీ లాభాలు ఆర్జించాలని భావించిన ఎన్నారైలు తీవ్రంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కొత్త ఇళ్ళు తక్కువ ధరకు లభిస్తుండటంతో…. పాత ఇళ్ళు అమ్మడం కష్టంగా మారింది. ఇళ్ళ ధరలు లక్ష డాలర్ల నుంచి రెండు లక్షల డాలర్ల వరకు తగ్గినట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రాసింది. మన కరెన్సీలో దాదాపు కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు తగ్గినట్లు. టెక్సాస్‌, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌ డీసీలలోని ఎన్నారైలు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు నన్నపనేని మోహన్‌ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు తెలిపారు. చాలా మంది చెప్పా పెట్టకుండా ఎయిర్‌ పోర్టుల వద్ద కార్లు పెట్టి భారత్‌కు వెళ్ళిపోతున్నారని గ్లోబల్‌ తెలంగాణ అసోసియేషన్‌ అధ్యక్షుడు కలవల విశ్వశ్వర్‌ రెడ్డి అన్నారు. ఇళ్ళ ధరలు 30 శాతంపైగా నష్టపోయాయని, వడ్డీ రేట్లు ఎంతగా పెరిగాయంటే… చాలా మంది రుణాలకు అర్హత కూడా పొందలేకపోతున్నారని అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడుగా ఎన్నికైన సతీష్‌ రెడ్డి అన్నారు.

Leave a Reply