For Money

Business News

మూసీ కోసం పైసా ఖర్చు పెట్టలేదు

కేసీఆర్‌ ప్రభుత్వం హయాంలో మూసీ నది కోసం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేసినా.. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. మూసీ అభివృద్ధి పథకం కోసం రూ. 50,000 కోట్లు అవుతుందని అంచనా వేసిన కేసీఆర్‌ ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో రూ.10వేల కోట్లు కేటాయించారు. అయితే బడ్జెట్‌లో కేటాయించిన మొత్తంలో ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పేర్కొంది. 2022-23 ఏడాదికి సంబంధించిన కాగ్‌ రిపోర్టును అసెంబ్లీ సమావేశాల చివరి రోజున సభలో ప్రవేశ పెట్టారు. మూసీ నది అభివృద్ధి కోసం కేసీఆర్‌ ప్రభుత్వం కేటాయించిన నిధులు, వాటిలో విడుదలకు సంబంధించిన సమచారాన్ని ప్రకటించింది. 2020-21లో ఈ ప్రాజెక్ట్‌ బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించిన కేసీఆర్‌.. ఒక్క పైసా ఖర్చు పెట్టకపోగా… తరువాతి బడ్జెట్‌ అంటే 2021-22 బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేవలం రూ. 2,600 కోట్లు కేటాయించారు. ఇందులో కూడా పైసా ఖర్చు పెట్టలేదు. ఆ తరవాతి బడ్జెట్‌ అంటే 2022-23 బడ్జెట్‌లో మూసీ నదీ అభివృద్ధికి దారుణంగా కేవలం రూ. 200 కోట్లు మాత్రమే కేటాయించారు. రూ. 50,000 కోట్ల ప్రాజెక్టుకు రూ. 200 కోట్లే కేటాయించినా… ఇందులో కూడా ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని కాగ్‌ పేర్కొంది. అంటే మూసీ ప్రాజెక్ట్‌ కోసం కేసీఆర్‌ ప్రభుత్వం పైసా కూడా ఖర్చు పెట్టలేదని కాగ్‌ స్పష్టం చేసింది. అలాగే 2018 నుంచి 2023 మధ్యకాలంలో పలు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ప్రకటించినా… ఏవీ సకాలంలో పూర్తి కాలేదని… దీంతో వీటి బడ్జెట్‌ లక్ష కోట్ల రూపాయల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరిందని కాగ్‌ పేర్కొంది.