బాబోయ్… ఇదేం పతనం…
స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్టర్ల నోటీ ఇదే మాట. గత అక్టోబర్ వరకు స్టాక్ మార్కెట్ పరుగులే చూసిన ఈతరం ఇన్వెస్టర్లకు ఇపుడు చుక్కులు కన్పిస్తున్నాయి. చూస్తుండగా రూ. 5000పైన ఉన్న షేర్లు.. ఇపుడు రూ.2000ను తాకుతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా బోర్లా పడుతున్నాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లు భారీగా క్షీణిస్తున్నాయి. నిజంగా సూచీలు ఓ 20 శాతం పడి ఉంటే… షేర్లు సగానికి పడ్డాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లలో మొదలైన తాజా నష్టాల జోరు ఉదయం ఆసియా మార్కెట్లను తాకింది. ఇపుడు యూరో మార్కెట్లు కూడా ఏకంగా రెండు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. జర్మనీ డాక్స్ 1.75 శాతం నష్టంతో ఉంది. ఇవన్నీ చూశాక.. మన మార్కెట్లు కూడా ఆ బాటలోనే నడుస్తున్నట్లు అనిపిస్తోంది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్నందున చివర్లో ఏమైనా షార్ట్ కవరింగ్ వస్తుందేమో చూడాలి. ప్రస్తుతానికి నిఫ్టి 15868 పాయింట్ల వద్ద 298 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అంతకుమునుపు 15800ని తాకింది. అంటే 380 పాయింట్లు నష్టపోయిందన్నమాట. నిఫ్టిలో నాలుగు ఐటీ షేర్లు, ఏషియన్ పెయింట్స్ గ్రీన్‌లో ఉన్నా… నామమాత్రపు లాభాలే. అదానీ, బజాజ్ ట్విన్స్‌లో అమ్మకాల జోరు అధికంగానే ఉంది. నిఫ్టి 1.85 శాతం నష్టపోగా, నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సుమారు రెండు శాతంపైగా నష్టంతో ఉండగా నిఫ్టి బ్యాంక్ 2.78 శాతం నష్టంతో ట్రేడవుతోంది.