అపుడే సంబరం వొద్దు
వరుసగా అయిదు రోజుల నష్టాలకు నిఫ్టి ఇవాళ గుడ్ బై చెప్పింది. ఆరంభంలో వెంటనే నష్టాల్లోకి జారుకున్నా… పావు గంటలోనే కోలుకుంది. రోజంతా గ్రీన్‌లో కొనసాగి 158 పాయింట్ల లాభంతో 24339 పాయింట్ల వద్ద ముగిసింది. 602 పాయింట్లు లాభపడంతో సెన్సెక్స్ 80వేలకు ఎగువన క్లోజైంది. బ్యాంక్, ఫైనాన్షియల్, మెటల్స్‌తో పాటు రియాల్టి షేర్ల మద్దతుతో నిఫ్టి ఇవాళ పటిష్ఠంగా క్లోజైంది. ఫార్మా నుంచి కూడా సపోర్ట్ లభించింది. వాస్తవానికి దిగువస్థాయి నుంచి నిఫ్టి 200 పాయింట్లు లాభపడింది. నిఫ్టికి శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజస్, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, విప్రోల నుంచి గట్టి మద్దతు లభించింది. అయితే కోల్ ఇండియా ఇవాళ కూడా దాదాపు నాలుగు శాతం క్షీణించింది. బజాజ్‌ఆటో పది వేల రూపాయల దిగువకు వచ్చింది. యాక్సిస్ బ్యాంక్, హీరో మోటోకార్ప్, బీఈఎల్‌లలో లాభాల స్వీకరణ కన్పించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు భారీగా క్షీణించడంతో మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్‌గా ఉందని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే నిఫ్టి 24500 స్థాయిని పటిష్ఠంగా దాటే వరకు … ప్రస్తుత లాభాలు నిలబడతాయని చెప్పలేమని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. లేదంటే మళ్ళీ పతనం ఖాయమని తెలిపారు. ఇవాళ్టి ర్యాలీలో మిడ్ క్యాప్స్ పాత్ర స్వల్పమేనని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం VIX 12.23 పెరిగి 14.63కి చేరింది. 15.7ని దాటితే ఇన్వెస్టర్ల గందరగోళం తప్పదని అనలిస్టులు అంటున్నారు. మున్ముందు మార్కెట్‌పై అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కూడా ప్రభావం చూపించనున్నాయి.