లాభాలన్నీ పాయే…
సెల్ ఆన్ రైజ్… ఫార్ములా ఇపుడు మార్కెట్ ఫేవరేట్‌గా మారింది. ఉదయం నిఫ్టి ఆర్జించిన లాభాలన్నీ మిడ్ సెషన్ నుంచి కరగడం ప్రారంభమైంది. ఒకవైపు అమెరికా, మరోవైపు యూరప్ మార్కెట్లు భారీ లాభాలతో ఉన్నా… మన మార్కెట్లు చాలా బలహీనంగా ఉన్నాయి. వాస్తవానికి వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్స్ కారణంగా నిఫ్టిలో లాభాల స్వీకరణ జరిగిందా లేదా అన్నది రేపటి ట్రెండ్‌ను బట్టి తెలుస్తోంది. కాని అనలిస్టులు మాత్రం పెరిగితే అమ్మండి అని క్లయింట్లకు సలహా ఇస్తున్నారు. నిఫ్టి తదుపరి టార్గెట్ 16400గా చెబుతున్నారు. ఇక ఇవాళ్టి ట్రేడింగ్ విషయానికొస్తే నిఫ్టి 16854 వద్ద ప్రారంభమై.. మిడ్ సెషన్‌కు ముందు 16945ని తాకింది. ఇక 17000లను క్రాస్ చేయడమే తరువాయి అని భావించిన ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే రెండు శాతంపైగా లాభంతో ఉన్న యూరో మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని అనుకున్నారు. కాని క్లోజింగ్‌కల్లా నిఫ్టి నాలుగు సార్లు నష్టాల్లోకి వెళ్ళి వచ్చింది. వెరశి 5 పాయింట్ల లాభంతో 16682 పాయింట్ల వద్ద ముగిసింది. మొత్తానికి డే ట్రేడర్స్‌కు ఇరువైపులా భారీ లాభాలు దక్కాయి. నిఫ్టిని ఇవాళ దారుణంగా దెబ్బతీసినవాటిలో బ్యాంకులు ఉండటం విశేషం. ఐటీ షేర్ల అండతో మార్కెట్ నిలదొక్కుకుంది. లేకుంటే భారీ నష్టాలు తప్పేవికావు. ఇవాళ ఇతర సూచీల్లో నిఫ్టి మిడ్ క్యాప్ దాదాపు అర శాతం లాభపడగా, నిఫ్టి బ్యాంక్ నష్టాల్లో ముగిసింది.