నిఫ్టికి ఒక శాతంపైగా నష్టం
ఆరంభంలో కొద్దిసేపు మినహా రోజంతా నిఫ్టి నష్టాల్లోనే కొనసాగింది. మిడ్ సెషన్లో యూరో మార్కెట్లు బలహీనంగా ప్రారంభం కావడంతో నిఫ్టి ఆ తరవాత బాగా డీలా పడింది. ఉదయం 17353 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి క్లోజింగ్‌కు ముందు 17096ని తాకింది. తరవాత స్వల్పంగా కోలుకుని 17112 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 174 పాయింట్లు క్షీణించింది. నిఫ్టిలో 40 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉండటం, మెటల్స్ కూడా దూసుకుపోవడంతో దేశీయ పరిశ్రమ చాలా ఇబ్బందులు పడుతోంది. ఈ త్రైమాసికంపై చాలా మంది విశ్లేషకులకు నమ్మకం పోయింది. నిఫ్టి బ్యాంక్‌లో కేవలం ఏయూ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మినహా మిగిలిన షేర్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ నిఫ్టి కన్నా నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ భారీగా నష్టపోయాయి.