For Money

Business News

హమ్మయ్య… నష్టపోయినా, 16,000 పైనే…

షేర్లు బాగా చితికిపోయినా… సూచీలు మాత్రం స్వల్ప నష్టంతో బయటపడ్డాయి. నిఫ్టి 16000 స్థాయిని కాపాడుకుంది. ఆరంభంలో ఆకర్షణీయ లాభాలు పొందినా… అక్కడి నుంచి 200 పాయింట్లుకు పైగా క్షీణించిన… నిఫ్టి దాదాపు కనిష్ఠస్థాయి వద్దే ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 99 పాయింట్ల నష్టంతో 16025 వద్ద ముగిసింది. ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16006. నిఫ్టి 0.62 శాతం నష్టంతో ముగిసినా… బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్‌లో ముగియడం విశేషం. అయితే అసలు దెబ్బ నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌లో పడింది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే… సూచీ రెండు శాతంపైగా పడింది. నిఫ్టి నెక్ట్స్‌ కూడా 1.7 శాతం నష్టపోయింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు ఏమాత్రం తగ్గకపోవడంతో ఏషియన్‌ పెయింట్స్‌లో ఒత్తిడి పెరుగుతోంది. ఇక దివీస్‌ ఇవాళ మరో నాలుగు శాతం క్షీణించింది. కేవలం మూడు సెషన్స్‌లో ఈ షేర్ రూ. 4400 నుంచి రూ. 3500లకు అంటే రూ.900 క్షీణించడం విశేషం. నిన్న కాస్త రాణించి పే టీఎం 8.5 శాతం క్షీణించగా, జొమాటొ 5 శాతంపైగా పడింది. మిడ్‌ క్యాప్‌లో ఐటీ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. ఎంఫసిస్‌, ఎల్‌ అండ్‌ టీఎస్‌, పర్సిస్‌టెంట్‌ 5 శాతంపైగా నష్టంతో ముగిశాయి.