For Money

Business News

నిఫ్టి: అరగంట అల్లకల్లోలం

నిన్న భారీగా క్షీణించి… ఇవాళ ఉదయం నుంచి గ్రీన్‌లో ఉంటూ.. పడినపుడల్లా కోలుకున్న నిఫ్టి… చివరి అరగంటలో అల్లకల్లోలం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు. క్షణాల్లో పేకమేడల్లా షేర్ల ధరలు కూలాయి. నిఫ్టి ఈ స్థాయిలో పడటం పెద్ద విశేషం కాదు. కాని ఉదయం నుంచి గ్రీన్‌లో ఉంటూ వచ్చి… కేవలం 30 నిమిషాల్లో ఈ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి రావడంతో అనేక మంది చిన్న ఇన్వెస్టర్లు దొరికిపోయారు. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను మార్కెట్‌ తట్టుకోలేకపోయింది. బ్లూచిప్‌ కంపెనీలు కూడా విలవిల్లాడాయి. నిన్న మార్కెట్‌ భారీగా పడినపుడు… గట్టిగా నిలబడిన షేర్లు కూడా ఇవాళ కకావికలమైపోయాయి. కేవలం 36 నిమిషాల్లో షేర్‌ మార్కెట్‌లో అల్లకల్లోలమే. ఎవరికి ఏం చేయాలో తెలియని స్థితి. ఉక్కు షేర్లుగా పేరొందిన బలమైన షేర్లలో కూడా విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముంతుంటే కొనే దిక్కు లేక ఆ షేర్లు విలవిల్లాడాయి. రూ.1750 దాకా పలికిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌కు రూ.1327 వద్ద కూడా కొనుగోలుదారులు లేరంటే మార్కెట్‌ ఎంత డొల్లగా ఉందో అర్థమౌతోంది. చిత్రంగా రెండేళ్ళ నుంచి ఎలాంటి ఎదుగుబొదుగూ లేని ఆ షేర్‌ పరిస్థితి అలా ఉంటే.. ఇక ఇతర షేర్ల సంగతి చెప్పకర్లేదు. ఉదయం నుంచి నిఫ్టి లాభాల నుంచి మూడు సార్లు నష్టాల్లోకి వెళ్ళి వచ్చింది. దీంతో ఇన్వెస్టర్లకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది… పడినా కోలుకుంటుందని. కాని 2 గంటలకు క్రమంగా మొదలైన అమ్మకాల ఒత్తిడి సరిగ్గా 2.56 నిమిషాలకు స్పీడందుకుంది. 17,250 నుంచి 16,824 పాయింట్లకు నాన్‌ స్టాప్‌గా పడుతూ వచ్చింది. ఏ కౌంటర్‌లో చూసిన అమ్మకాల ఒత్తిడే. అపోలో హాస్పిటల్స్‌, కోల్‌ ఇండియా, రిలయన్స్‌ మినహా… మిగిలిన అన్ని కౌంటర్లలో ఒత్తిడే. నిఫ్టిలో 44 షేర్లు భారీగా పతనమయ్యాయి. HDFC ఆరు శాతంపైగా నష్టపోగా, HDFC లైఫ్‌ 5.45 శాతం, HDFC బ్యాంక్‌ షేర్లు 4.33 శాతం చొప్పున నష్టపోయాయి. దీనికితోడు ఫార్మా సూచీ కూడా ఒక శాతంపైగా నష్టపోయింది. నిఫ్టి చివర్లో 16,824 నుంచి స్వల్పంగా కోలుకుని 16,868 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 703 పాయింట్లు కోల్పోయి 58,468 వద్ద క్లోజైంది.