కుప్పకూలిన నిఫ్టి
ఉదయం మార్కెట్ ప్రారంభానికి ముందే టెక్నికల్స్ అమ్మకాలకు చాలా అనుకూలంగా ఉన్నాయి. వెబ్సైట్ దిగువన ఇచ్చిన వీడియోలో సీఎన్‌బీసీ ఆవాజ్ డేటా అనలిస్ట్ వీరేందర్ ఇచ్చిన డేటా చాలా స్పష్టంగా నిఫ్టికి ప్రతిఘటన ఉందని పేర్కొన్నారు. దీనికి కారణం 18200 నుంచి పైన అన్ని స్థాయిల్లోనూ కాల్ రైటింగ్ చాలా జోరుగా ఉండటమే. అయితే 18000 వద్ద పుట్ రైటింగ్ ఓపెన్ ఇంటరెస్ట్ బాగానే ఉండటంతో నిఫ్టికి ఈస్థాయిలో మద్దతు లభిస్తుందని ఆశించారు. అయిఏ 17900 వద్ద ఎలాంటి కాల్ రైటింగ్ లేదు. ఓపెన్ ఇంటరెస్ట్ కేవలం 19.97 లక్షలు మాత్రమే. అంటే మార్కెట్ ఎంత వరకు పడుతుందో విదేశీ ఇన్వెస్టర్లకు కూడా తెలియదన్నమాట. దీంతో ఈ స్థాయిని కూడా వొదిలేశారు. దీంతో నిఫ్టి నేరుగా 17800 దిగువకు వెళ్ళిపోయింది. సాధారణంగా పుట్ రైటింగ్ జోరుగా ఉంటే అదే మార్కెట్‌కు మద్దతు స్థాయిగా భావిస్తారు. కాని 18000 తరవాత అస్సలు లేకపోయే సరికి… నిఫ్టికి ఎలాంటి అండ లభించలేదు. దీంతో నిఫ్టి 17,779ని తాకింది. క్లోజింగ్‌లో అతి కష్టంపై 17806 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 320 పాయింట్లు నిఫ్టి క్షీణించింది. ఇక సెన్సెక్స్ 980 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం కాస్త గ్రీన్‌గా కన్పించిన ఫార్మా సూచీ కూడా రెడ్‌లో ముగిసింది. ఉదయం రూ. 3640ని తాకిన దివీస్‌ల్యాబ్ రూ.3506 వద్ద ముగిసింది. మార్కెట్లో భారీ ఒత్తిడికి ఈ ఒక్క స్క్రిప్‌లో జరిగిన ట్రేడింగే ఉదాహరణ. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా నిఫ్టి నెక్ట్స్ 3.72 శాతం క్షీణించింది. నిఫ్టి మిడ్ క్యాప్ కూడా 3.23 శాతం క్షీణించింది. బ్యాంక్ నిఫ్టిలో కూడా అమ్మకాల జోరు అధికంగా ఉండటంతో 1.78 శాతం క్షీణించింది. నిఫ్టిలో మూడు షేర్లు గ్రీన్‌లో ఉన్నా… అవి నామమాత్రమే. మిగిలిన షేర్లన్నీ భారీ నష్టాలతో ముగిశాయి.