భారీ నష్టాల్లో ముగిసిన నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లలో ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో వచ్చిన లాభాల స్వీకరణ.. మన మార్కెట్లలోనూ కొనసాగింది. రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత కొన్ని రోజులుగా ఆకర్షణీయ లాభాలతో ట్రేడైన నాస్డాక్ రాత్రి రెండు శాతంపైగా నష్టపోయింది. దీనికి భిన్నంగా గత కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న చైనా మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా హాంగ్‌సెంగ్ మార్కెట్లు ఆకర్షణీయంగా లాభపడ్డాయి. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ఏకంగా 279 పాయింట్లు నష్టపోయి 19700 పాయింట్లను తాకింది. ఉదయం 19,887ని తాకిన మిడ్ సెషన్ తరవాత భారీగా నష్టపోయింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 234 పాయింట్ల నష్టంతో 19745 పాయింట్ల వద్ద ముగిసింది. ఇతర సూచీల్లో ఈ స్థాయిలో అమ్మకాలు లేవు. పైగా మిడ్ క్యాప్ సూచీ గ్రీన్‌లో ముగిసింది. ఇన్ఫోసిస్ ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో … ఈ కౌంటర్ భారీ ఒత్తిడి వచ్చింది. ఈ షేర్ దాదాపు 8 శాతం నష్టంతో ముగిసింది. ఇతర ప్రధాన బ్లూచిప్ షేర్లు కూడా నష్టాలతో ముగిశాయి. రిలయన్స్ ఇవాళ మరో రెండున్నర శాతం నష్టంతో రూ. 2555 వద్ద ముగిసింది. ఇవాళ కంపెనీ ఫలితాలను ప్రకటించనుంది. మరోవైపు ఎల్ అండ్ టీ 4 శాతం లాభపడటం విశేషం. నిఫ్టి నెక్ట్స్‌లో మెక్‌డొనాల్డ్ ఆరున్నర శాతం లాభపడగా, హావెల్స్ మూడు శాతంపైగా నష్టపోయింది. ఇక మిడ్ క్యాప్ షేర్లలో ఎంఫసిస్ 5 శాతం లాభంతో క్లోజ్ కావడం విశేషం.