For Money

Business News

నిరాశపర్చిన రిలయన్స్‌

జూన్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిరుత్సాహకర ఫలితాలను ప్ర కటించింది. మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఏప్రిల్‌ – జూన్‌ మధ్యకాలంలో కంపెనీ రూ. 2.11 లక్షల కోట్ల టర్నోవర్‌పై రూ. 16,011 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికంలో రూ.17,955 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన ఆ కంపెనీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాణించలేకపోయింది. కంపెనీ నికర లాభం 11 శాతం క్షీణించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం అంటే మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.19,299 కోట్ల నికర లాభం ఆర్జించింది. వాటాదారులకు ఒక్కో షేర్‌కు రూ. 9 డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ డైరెక్టర్లు ప్రతిపాదించారు. క్రూడాయిల్‌ ధరలు తక్కువగా ఉండడం, చమురు మార్జిన్లు తగ్గడం ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆదాయంలో ఈ విభాగం నుంచి 63 శాతం టర్నోవర్‌ నమోదవుతోంది. అయితే డిజిటల్‌, రీటైల్‌ రంగంలో కంపెనీ రెండంకెల వృద్ధి రేటును సాధించింది. ఈ రెండు విభాగాలు కంపెనీని కాపాడాయని చెప్పొచ్చు. గత ఏడాదితో పోలిస్తే రీటైల్‌ విభాగం టర్నోవర్‌ 20 శాతం పెరిగి రూ. 69,962 కోట్లకు చేరగా, డిజిటల్‌ సర్వీసెస్‌ రంగం 13 శాతం వృద్ధితో రూ. 32,077 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. వడ్డీల కోసం కేటాయించిన మొత్తం 46 శాతం పెరిగి రూ. 5,837 కోట్లకు చేరింది.