16,500 దిగువన ముగిసిన నిఫ్టి
నిఫ్టిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఉదయం 16636 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకిన నిఫ్టి రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. మిడ్ సెషన్‌కు ముందు కొద్దిగా కోలుకున్న నిఫ్టి తరవాత మళ్ళీ క్షీణించి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16,463ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని 16483 వద్ద ముగిసింది. నిఫ్టిలో 38 షేర్లు నష్టాలతో క్లోజ్ కావడం విశేషం. యూరో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా… అమెరికా మార్కెట్ ఫ్యూచర్స్ స్వల్ప నష్టాల్లో ఉన్నా నిఫ్టి 0.88 శాతం పడిపోవడం విశేషం. నిజానికి నిఫ్టి మిడ్‌క్యాప్‌లో భారీ అమ్మకాలు జరిగాయి. ఈ సూచీ 1.64 శాతం క్షీణించింది. అలాగే నిఫ్టి నెక్ట్స్ కూడా 1.27 శాతం పడిపోయింది. ఐటీ షేర్లతో పాటు ఇటీవల ఫలితాలు ప్రకటించిన పలు కంపెనీల షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడం విశేషం. కొటక్ బ్యాంక్, యాక్సిస్, హెచ్‌యూఎల్ ఉదాహరణ. మిడ్ క్యాప్ భారీ పతనానికి కారణంగా.. మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో గట్టి అమ్మకాల ఒత్తిడి రావడమే. ఇక జుమాటో మరో 12 శాతం పైగా పడటంతో నిఫ్టి నెక్ట్స్ సూచీ బాగా దెబ్బతింది. పేటీఎం, నౌకరీ షేర్లలో కూడా ఒత్తిడి బాగా వచ్చింది.