For Money

Business News

17,700పైన ముగిసిన నిఫ్టి

చివర్లో స్వల్ప ఒత్తిడి వచ్చినా… నిఫ్టి 17700పైన ముగిసింది. ఉదయం కొద్దిసేపు నష్టాల్లో ఉన్న నిఫ్టి… తరవాత కోలుకుని రోజంతా లాభాల్లోనే కొనసాగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 53 పాయింట్ల లాభంతో 17711 వద్ద నిఫ్టి ముగిసింది. ఇతర ప్రధాన సూచీలన్నీ గ్రీన్లో ముగిశాయి. అయితే లాభాలన్నీ అర శాతం లోపే. నిఫ్టిలో 32 షేర్లు లాభాల్లో ముగియగా, కేవలం 18 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టికి ఇవాళ కలిసి వచ్చింది. అనేక కంపెనీలు ఫలితాలు ప్రకటిస్తున్నాయి. ఆ మేరకు షేర్లు కూడా స్పందిస్తున్నాయి. ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా ఓఎన్‌జీసీ నిలవగా, రెండో స్థానంలో టాటా స్టీల్‌, మూడో స్థానంలో ఎన్‌టీపీసీ ఉంది. ఇక ఇవాళ ఫలితాలు మార్కెట్‌ అంచనాలకు దగ్గరిగా ఉన్నా దివీస్‌ ల్యాబ్‌లో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో షేర్‌ ఆరు శాతం నష్టంతో రూ. 3711 వద్ద ముగిసింది. అలాగే నిరాశాజనక ఫలితాలు ఇవ్వడంతో అపోలో హాస్పిటల్‌ షేర్‌ 3 శాతం పైగా క్షీణించింది. ఇక జొమాటొలో మళ్ళీ కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది. అయితే పేటీఎంలో ఒత్తిడి కొనసాగుతోంది. పేటీఎం ఇవాళ నాలుగు శాతం నష్టపోయింది. భారత్‌ ఫోర్జ్‌ రికార్డు స్థాయిలో ఏడు శాతం లాభపడింది. నిఫ్టి బ్యాంక్‌ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. మిగిలిన షేర్లలో బాటా ఇండియా పెరిగినట్లే కన్పించినా.. నష్టాల్లో ముగిసింది.