అమ్మకాల ఒత్తిడి… అయినా లాభాల్లోనే
ఇవాళ ఉదయం మార్కెట్ వంద పాయింట్లకుపైగా లాభంతో మొదలైంది. కాని వెంటనే 16,722కు పడింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,936 పాయింట్లకు పెరిగింది. క్రితం ముగింపుతో పోలిస్తే 250 పాయింట్లకు పైగా పెరిగింది. మిడ్ సెషన్ తరవాత నిఫ్టికి గట్టి ఝలక్ ఇచ్చారు షార్ట్ సెల్లర్స్. ఉదయం కనిష్ఠ స్థాయిని కూడా కోల్పోయి ఏకంగా 250 పాయింట్లు క్షీణించి16,668ని తాకింది నిఫ్టి. సో… రెండోసారి షార్ట్ సెల్లర్స్‌కు భారీ లాభాలు దక్కాయన్నమాట. చివర్లో స్వల్పంగా కోలుకుని 16,770 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 157 పాయింట్లు పెరిగింది. కాని ఉదయం, మిడ్ సెషన్ తరవాత షార్ట్ సెల్లర్స్‌కు నిఫ్టి ఆకర్షణీయ లాభాలు ఇచ్చింది. టెక్నికల్ అనలిస్టుల అంచనా మేరకు నిఫ్టి 16,700 స్థాయిని కాపాడుకుంది. నిఫ్టిలో ఇవాళ 39 షేర్లు లాభాల్లో ముగిశాయి. మిడ్ క్యాప్ షేర్లు ఒకటిన్నర శాతం లాభపడినా… బ్యాంక్ నిఫ్టి ఇవాళ కూడా నిరాశపర్చింది. నిన్న ఏకంగా నాలుగు శాతం దాకా క్షీణించిన బ్యాంక్ నిఫ్టి ఇవాళ కేవలం 0.5 శాతం లాభంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫైనాన్షియల్ నిఫ్టి లాభం ఇంకా తక్కువ. ఇవాళ అత్యధిక లాభంతోముగిసింది నిఫ్టి నెక్ట్స్ 50. ఇక రంగాల వారీగా వస్తే మెటల్స్ బాగా రాణించాయి.