భారీ లాభాలతో ముగిసిన నిఫ్టి
యూరో మార్కెట్లు నిలదొక్కుకోవడంతో మన మార్కెట్ కూడా ఆకర్షణీయ లాభాలతో ముగిసింది. మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. దీంతో మన మార్కెట్ స్వల్పంగా బలహీనపడింది. ట్రేడింగ్ కొనసాగే కొద్దీ యూరో మార్కెట్లు బలపడటంతో మన మార్కెట్లు కూడా మరింత పుంజుకుని 16,370 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకాయి. అక్కడి నుంచి స్వల్పంగా క్షీణించి 16,352 పాయింట్ల వద్ద నిఫ్టి ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 182 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్ కూడా 632 పాయింట్లు లాభపడింది. నిఫ్టి ఒక శాతంపైగా లాభంతో క్లోజ్ కాగా, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీ 1.68 శాతం లాభంతో ముగిసింది. అతి తక్కువగా నిఫ్టి నెక్ట్స్ 0.68 శాతం మాత్రమే లాభపడింది. నిఫ్టిలో 35 షేర్లు లాభపడగా 5 శాతంపైగా లాభపడిన అపోలో హాస్పిటల్స్ నిఫ్టి టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌తో పాటు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ కూడా ఇవాళ బాగా లాభపడింది. అలాగే బజాజ్ ట్విన్స్. టెక్ షేర్లలో కూడా ఆసక్తి కబడింది. చమురు ధరలు పెరగడం వల్ల భారీగా లాభపడిన కంపెనీలపై ప్రత్యేక పన్ను విధిస్తారన్న వదంతులతో ఓఎన్‌జీసీ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఈ షేర్ 5.5 శాతం క్షీణించింది.