For Money

Business News

దిగువస్థాయిలో మళ్ళీ మద్దతు

వీక్లీ డెరివేటివ్స్‌ రోజు డే ట్రేడర్లకు కాసుల పంట పండించింది నిఫ్టి. సరిగ్గా మద్దతు, ప్రతిఘటన స్థాయిలను తాకడంతో ఆల్గో ట్రేడర్లు భారీ లాభాలు పొందారు. నిఫ్టి ఇవాళ అమెరికా ఫ్యూచర్స్‌కు అనుగుణంగా కదలాడాయి. ఉదయం నుంచి లాభాల్లో ఉన్న నిఫ్టి యూరో ఫ్యూచర్స్‌ ప్రారంభానికి ముందు ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 15628ని తాకాయి. యూరో ఫ్యూచర్స్‌తో నష్టాలతో ప్రారంభం కావడంతో నిఫ్టిలో అమ్మకాలు మొదలయ్యాయి. అలాగే అమెరికా ఫ్యూచర్స్‌ కూడా నష్టాల్లోకి జారుకున్నాయి. నిఫ్టి తీవ్రంగా ఓవర్‌ సోల్డ్‌ జోన్‌లో ఉన్న విషయం తెలిసిందే. యూరో నష్టాలు తగ్గడం, అమెరికా ఫ్యూచర్స్‌ గ్రీన్‌లోకి రావడంతో నిఫ్టి మళ్ళీ కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే 143 పాయింట్లు లాభంతో 15,556 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 443 పాయింట్లు పెరిగింది. నిఫ్టిలో ఇవాళ ఆటో షేర్ల హవా నడిచింది. టాప్‌ 5 షేర్లు ఆటో రంగానికి చెందినవే. మిడ్‌ క్యాప్‌ టాప్‌ 5లో అశోక్‌ లేల్యాండ్‌ ఉంది. మెటల్స్‌ ఒత్తిడి కొనసాగింది. నిఫ్టితో పాటు దాదాపు అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. నిఫ్టి మిడ్ క్యాప్‌ సూచీ 1.54 శాతం పెరిగింది. దివీస్‌ ల్యాబ్‌ వరుసగా ఇవాళ కూడా లాభాల్లో ముగిసింది. మే 26నరూ.3365ను తాకిన ఈ షేర్‌ ఇవాళ రూ. 3665 వద్ద ముగిసింది. ఎల్‌ఐసీ ఇవాళ నష్టాల్లో ముగియడం కొసమెరుపు.