For Money

Business News

కీలక స్థాయి కోల్పోయిన నిఫ్టి.. నెక్ట్స్‌ ఏమిటి?

మార్కెట్‌కు చాలా కీలకం 200 రోజల చలన సగటు. ప్రస్తుతం ఈ స్థాయి 17000 ప్రాంతంలో ఉంది. ఈ స్థాయికి 149 పాయింట్ల దిగువన నిఫ్టి ఇవాళ క్లోజైంది. గత కొన్ని రోజులుగా ఎంత పడినా వెంటనే 17000 పాయింట్ల స్థాయిని నిఫ్టి కాపాడుకుంటూ వచ్చింది. కాని ఇవాళ చాలా స్పష్టంగా ఆ స్థాయిని కోల్పోయింది. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన చందన్‌ తపారియా ప్రస్తుత స్థితిపై స్పందిస్తూ… నిఫ్టి 17000 దిగువన ఉన్నంత వరకూ బలహీనంగా ఉంటుందని అన్నారు. ఈ స్థాయిని అధిగమించకపోతే 16,666 లేదా 1500 స్థాయికి చేరుతుందని అన్నారు. ఎపుడైనా షార్ట్‌ కవరింగ్‌ వచ్చినా 17071 లేదా 17166 స్థాయిని దాటే అవకాశం లేదని అన్నారు. మార్కెట్‌లో ఆప్షన్స్‌ గురించి మాట్లాడుతూ… గరిష్ఠంగా కాల్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 17000 -17200 స్ట్రయిక్‌ వద్ద ఉందని అన్నారు. అలాగే గరిష్ఠ పుట్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 16500-16800 స్ట్రయిక్‌ వద్ద అధికంగా ఉందని అన్నారు. ఇక 17000 – 16900 స్ట్రయిక్‌ వద్ద కాల్ రైటింగ్‌ అధికంగా ఉందని అన్నారు. అంటే నిఫ్టి పెరిగితే ఈ స్థాయిలను దాటే ప్రసక్తే లేదన్నమాట. అలాగే పుట్‌ రైటింగ్‌ 16700-16600 స్ట్రయిక్‌ వద్ద అధికంగా ఉన్నట్లు తపారియా చెప్పారు. ఈ విధంగా చూస్తే నిఫ్టి ఈ స్థాయిలకు మించి దిగువకు వెళ్ళకపోవచ్చు. సో… కాల్, పుట్‌ రైటింగ్‌ గరిష్ఠ స్ట్రయిక్స్‌ చూస్తే నిఫ్టి 16500-17000 మధ్యనే కొనసాగే అవకాశముంది.ఆప్షన్స్‌ డేటా చెప్పే సత్యం ఇది. ఇక ఇదే సంస్థకు చెందిన రీటెయిల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ ఖెమ్కా నిఫ్టి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ…అంతర్జాతీయ పరిణామాల కారణంగా కూడా నిఫ్టి బలహీనంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. అయితే కొన్ని కొన్ని రంగాల్లో కొన్ని షేర్లు రాణించే అవకాశముంది. అంటే షేర్లను బట్టి అవకాశాలు ఉంటాయని.. వాటిని ఇన్వెస్టర్లు అందిపుచ్చుకోవాలని ఆయన అంటున్నారు. ముఖ్యంగా పండుగల సీజన్‌ కావడంతో ఆటో, వినియోగరంగాలకు చెందిన షేర్లలో కొన్ని అవకాశాలు ఉండొచ్చని అన్నారు. సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన డెరివేటివ్స్‌్ అన్ని రేపటితో క్లోజ్‌ అవుతాయి. రోల్‌ ఓవర్స్‌ను బట్టి ట్రెండ్‌పై రేపు ఒక అవగాహనకు రావొచ్చు. అక్టోబర్‌ సిరీస్‌ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండో వారం నుంచి రెండో త్రైమాసిక కార్పొరేట్‌ ఫలితాలు ఉంటాయి.