AP: రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్
ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఏపీకి కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తున్నాయి. ఇటీవలే అమరావతికి ఏకంగా రూ. 15,000 కోట్ల గ్రాంట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 2,245 కోట్లతో అమరావతికి కొత్త రైల్వే లైన్ మంజూరు చేసింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ మేరకు ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరిస్తూ రైల్వే లైన్‌కు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్తగా నిర్మించే రైల్వే లైన్ మార్గాన్ని గ్రాఫ్ సాయంతో మీడియాకు వివరించారు. 57 కి.మీ.లు ఉండే ఈ కొత్త రైల్వే లైన్‌లో భాగంగా కృష్ణా నదిపై 3.2 కి.మీ పొడవైన వంతెన నిర్మిస్తారు. ఈ కొత్త రైల్వే లైన్ అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు మధ్య నిర్మిస్తారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ ఈ రైల్వేలైన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. బీహార్‌కు కూడా రూ.4,553 కోట్ల వ్యయంతో కొత్త రైల్వే ప్రాజెక్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.