మళ్ళీ నష్టాల్లో నాస్డాక్
రీటైల్ సేల్స్ పటిష్ఠంగా ఉండటంతో పాటు నిరుద్యోగ భృతి కోసం దాఖలైన దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో అమెరికా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఎలాంటి పాజిటివ్ వార్తలు వచ్చినా… షేర్ మార్కెట్లో అమ్మకాలు పెరుగుతున్నాయి. రీటైల్ సేల్స్ బాగా పెరగడంతో ధరలు మరింత పెరిగే అవకాశముంది… నిరుద్యోగ భృతి కోసం వచ్చే క్లయిములు తగ్గాయంటే మార్కెట్ ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా కేంద్ర బ్యాంక్ ఈ నెలలో కచ్చితంగా 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ భయాలతో ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు అధికమౌతున్నాయి. తాజా సమాచారం మేరకు నాస్డాక్ 1.27 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.75 శాతం… డౌజోన్స్ 0.07 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఓపెనింగ్ నుంచి గ్రీన్లో ఉన్న యూరో మార్కెట్లు కూడా నష్టాల్లోకి జారకున్నాయి. యూరో స్టాక్స్ 500 సూచీ 0.77 శాతం నష్టంతో ఉంది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 109ని దాటగా, పదేళ్ళ ట్రెజరీ బాండ్స్ ఈల్డ్స్ 3.45 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో క్రూడ్ ధరలు నాలుగు శాతంపైగా క్షీణించాయి. డాలర్ పెరిగినందు వల్ల ఇదే స్థాయి తగ్గింపు భారత్ వంటి మార్కెట్లకు దక్కకపోవచ్చు.