For Money

Business News

ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ డీల్‌కు బ్రేక్‌

ట్విటర్‌ టేకోవర్‌ కోసం తాను ప్రకటించిన డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నట్లు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. 4400 కోట్ల డాలర్లతో ట్విటర్‌లో పూర్తి వాటా కొంటానని ఎలాన్‌ మస్క్‌ ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. ట్విటర్‌లో ఉన్న ఫేక్‌ అకౌంట్స్‌ లేదా స్పామ్‌ అధికంగా ఉందని ఎలాన్‌ మస్క్‌ వర్గం అంటోంది. అయితే దీన్ని ఖండిస్తూ ట్విటర్‌ సమాధానం ఇచ్చింది. మొత్తం ఖాతాల్లో ఇలాంటి ఖాతాలు 5 శాతం కంటే తక్కువే ఉంటాయని పేర్కొంది. ఇది చాలా ఎక్కవని, డీల్‌ పూర్తయితే వాటిని తొలగించడానికి తాను అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని ఎలాన్ మస్క్‌ అన్నారు. అయితే డీల్‌ ఇలా నిలిచిపోవడానికి కారణం ఇది మాత్రమే కాదని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ట్విటర్‌ డీల్‌ ప్రకటించిన తరవాత టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. ట్విటర్‌ డీల్‌ కోసం టెస్లా షేర్లను మోర్గాన్‌ స్టాన్లీ వద్ద తాకట్టు పెట్టారు ఎలాన్‌ మస్క్‌. టెస్లా కంపెనీ తరఫున ప్రిఫెరెన్షియల్‌ షేర్లు జారీ చేసి 600 కోట్ల డాలర్లు సమీకరించాలని, దీంతో రుణ భారం తగ్గుతుందని మస్క్‌ భావిస్తున్నారు. ఎలాన్‌ మస్క్‌ తాజా ప్రకటన తరవాత ట్విటర్‌ షేర్‌ 23 శాతం క్షీణించగా, టెస్లా షేర్‌ 4.8 శాతం పెరిగింది.