For Money

Business News

చాలా క్రిప్టో కరెన్సీలు మాయమైపోతాయ్‌

భారత ప్రభుత్వం క్రిప్టో చట్టాలు తీసుకు వస్తున్న నేపథ్యంలో క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ రాజన్‌ స్పందించారు. సీఎన్‌బీసీ టీవీ18తో ఆయన మాట్లాడుతూ… అసలు ఈ కరెన్సీల వాస్తవ విలువ ఏమిటని ఆయన ప్రశ్నించారు. వస్తువులు, కరెన్సీలకు ఒక విలువ ఉంటుందని, దాన్ని సమర్థించే కారణాలు ఉంటాయని అన్నారు. మరి క్రిప్టోకు ఉన్న విలువ ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. క్రిప్టోను కమాడిటీగా భావిస్తారా లేదా కరెన్సీగా భావిస్తారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. క్రిప్టోల మైనింగ్‌ భారత్‌లో ప్రారంభమైతే.. దాన్ని ఎలా పరిగణిస్తారని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌పై దీని ప్రభావం ఉంటుంది కదా అని ఆయన ప్రశ్నించారు.
6000లకుపైగానే ఉన్నాయి…
క్రిప్టో కరెన్సీలకు అనూహ్య విలువ పలకడం గురించి ఆయన ప్రశ్నించగా… ఇపుడు మార్కెట్‌లో 6000లకు పైగా క్రిప్టో కరెన్సీలు ఉన్నాయని… వీటిలో చాలా వరకు కరెన్సీలు కనుమరుగు అవుతాయన్నారు. 17వ శతాబ్దంలో తులిప్‌ మానియా వచ్చిందని, క్రిప్టో కరెన్సీ కూడా అలాంటిదేనని ఆయన స్పష్టం చేశారు. చాలా బలమైన కొన్ని కరెన్సీలు తప్ప మిగిలినవి మాయం కావడం ఖాయమని ఆయన చెప్పారు. క్రిప్టో కరెన్సీ అనేది ఒక బుడగ అని ఆయన అన్నారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌ కూడా నియంత్రణ లేని చిట్‌ ఫండ్‌ మార్కెట్‌లాంటిదని… ఏదో ఒక రోజున చిట్టీల వాడు మాయమైనట్లే…ఇవి కూడా మాయమౌతాయని రఘురామ రాజన్‌ అన్నారు. క్రిప్టో కరెన్సీలకు అసలు విలువే లేదని కాదని… వీటికి శాశ్వత విలువ అంటూ ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. చాలా కరెన్సీలు దేశ, విదేశాల్లో చెల్లింపులకు పేమెంట్ వెహికల్‌గా ఉంటాయే తప్ప… వీటి వల్ల మరో ప్రయోజనం ఉండదని అన్నారు.