ఎల్లుండి లక్ష గోల్డ్ లోన్స్ వేలం!
కరోనా కాలంలో మిలియనీర్లు… బిలినీయర్లయితే… మధ్య తరగతి ప్రజలు పేద తరగతిలో చేరిపోయారు. ఇక పేదల సంగతి సరే. కరోనా కష్టంకాలంలో ఉపాధి పోవడం, వైద్య ఖర్చులు పెరగడంతో వేల కుటుంబాలు తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి జీవితాన్ని నెట్టుకొచ్చారు. కరోనా తగ్గింది. కాని ఉపాధి అవకాశాలు రాలేదు. చిన్న వ్యాపారాలు పూర్తిగా మూసుకుపోయాయి. ఇప్పటికీ దేశంలోని పరిశ్రమలు తమ కెపాసిటీలో 60శాతం విద్యుత్‌ను వాడలేని పరిస్థితి ఉంది. అంటే డిమాండ్‌లేక ఉత్పత్తి చేయడం లేదు. దీంతో ఉపాధి అవకాశాలు లేవు. దీంతో తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దేశంలో బ్యాంకులతో పాటు ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి ఎన్బీఎఫ్షీ సంస్థలు భారీగా గోల్డ్‌లోన్స్ ఇస్తాయి. లోన్స్ కట్టకపోవడంతో… డీఫాల్టర్ల రుణాలను వేలం వేసేందుకు ఈ సంస్థలు సిద్ధమౌతున్నాయి. దేశ వ్యాప్తంగా ఎల్లుండి ఏకంగా లక్ష గోల్డ్ లోన్స్ ఖాతాలను వేలం వేయనున్నారు. ఈ మేరకు సంస్థలు/బ్యాంకులు 59 నోటీసులు జారీ చేశారు. వీటిలో లక్షకు పైగా ఖాతాలు ఉన్నట్లు తేలింది. 2020 జనవరిలో దాదాపు గోల్డ్ లోన్స్ విలువ రూ. 29,355 కోట్లు కాగా. తరవాత పెరగనారంభించాయి. ఇవి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వంటి ఆర్బీఐ నమోదైన సంస్థల వద్ద తాకట్టు పెట్టిన బంగారం లెక్కలు. ఆ వెంటనే కరోనా రావడంతో ఈ మొత్తం రూ. 48,859 కోట్లకు చేరింది. 2021 చివరినాటికి ఈ మొత్తం రూ. 70,871 కోట్లకు చేరింది. ఇక అనధికారిక వ్యాపారస్థుల వద్ద తాకట్టు పెట్టిన గోల్డ్ లోన్స్ లెక్కలేకి రాలేదు. ఈ మొత్తం తాకట్టులో ఒక్క ముత్తూట్ ఫైనాన్స్ వద్ద తాకట్టు పెట్టిన నగల విలువ రూ.39,096 కోట్ల నుంచి రూ.61,696 కోట్లకు చేరింది. సిబిల్ స్కోరు వంటి నిబంధనలతో సంబంధం లేకుండా కేవలం బంగారంపై 70 శాతం వరకు ఈ సంస్థలు రుణాలు ఇస్తాయి. దీంతో చాలా మంది వీటి వద్ద గోల్డ్ లోన్ తీసుకుంటారు. అయితే వడ్డీ భారం పెరగడం, ఆదాయ మార్గాలు లేకపోవడంతో చాలా మంది తమ నగలను విడిపించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈనెల 16న అంటే ఎల్లుండి లక్షలకు పైగా గోల్డ్ లోన్స్ వేలానికి వస్తున్నాయి. కోవిడ్‌తో తీవ్ర ఇబ్బందులు పడ్డ చెన్నై, బెంగళూరు, కోచిలలో డీఫాల్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. (Courtesy:Bhaskar.com)