షియోమి నుంచి గోల్డ్ లోన్, పర్సనల్ లోన్ ఇంకా…
షియోమి అంటే ఇప్పటి వరకు స్మార్ట్ఫోన్ల కంపెనీగానే తెలుసు. కాని షియోమి ఇప్పటికే దేశంలో వివిధ రకాల ఆర్థిక సేవలను అందిస్తోంది. కరోనా కారణంగా కాస్త.. ఓ అడుగు వెనక్కి వేసినా.. ఇపుడు పూర్తి స్థాయిలో ఆర్థిక సేవలు అందించేందుకు రెడీ అవుతోంది. గోల్డ్ లోన్, పర్సనల్ లోన్, ఇన్సూరెన్స్ స్కీములలో పాటు క్రెడిట్ లైన్ కార్డులను అందించనుంది. గత ఏడాది యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, స్టాష్ ఫిన్ వంటి కంపెనీల భాగస్వామ్యంతో వివిధ ఆర్థిక సేవలు అందించింది. కరోనా కారణంగా ఆ సర్వీసుల స్పీడు తగ్గింది. మి క్రెడిట్, మి ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో ఇపుడు భారీ ఎత్తున సేవలు అందిస్తున్నట్లు మనదేశంలో షియోమి హెడ్ మనూ జైన్ అన్నారు. 2018లో మి పే సర్వీస్ పేరుతో వివిధ రకాల సేవలను కంపెనీ అందిస్తోంది. దీంట్లో ఇప్పటి వరకు 5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
రూ. 25 లక్షల వరకు…
గతంలో మి క్రెడిట్ కింద లక్ష రూపాయల వరకు ప్రి అప్రూడ్ లోన్ ఇచ్చేది షియోమి. గడువు 60 నెలలు ఉండేది. ఇపుడు ప్రి అప్రూవ్డ్ లోన్ పరిమితిని రూ. 25 లక్షలకు పెంచినట్లు షియోమి తెలిపింది.అలాగే ఎస్ఎంఈ లోన్లు, క్రిడిట్ లైన్ కార్డులను కూడా ఇస్తున్నట్లు మనూ జైన్ తెలిపారు. ప్రి అప్రూవ్డ్ లోన్‌తో సహా… ఇపుడు కొనండి, తరవాత చెల్లించండి పద్ధతిలో క్రెడిట్ లైన్ కార్డులను జారీ చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్ని వారాల్లో గోల్డ్ లోన్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.