అంచనాల మేరకు మారుతీ
ప్రధాన కార్పొరేట్ సంస్థల ఫలితాలు వస్తున్నాయి. దాదాపుగా అన్నీ మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉంటున్నాయి. ఏవీ అద్భుత ఫలితాలు చూపడం లేదు. అంతుకే చాలా కంపెనీల ఫలితాలు వచ్చిన తరవాత వాటి షేర్లు క్షీణిస్తున్నాయి. తాజాగా మారుతీ సుజుకి ఫలితాలు ప్రకటించింది. మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 26740 కోట్ల టర్నోవర్‌పై రూ. 1839 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ఫలితాలు మార్కెట్ దాదాపుగా అంచనా వేసినవే. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 11 శాతం, నికర లాభం 57.7 శాతం చొప్పున పెరిగాయి. కంపెనీ ఒక్కో షేరుకు రూ.60 డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించింది. డివిడెండ్ కింద కంపెనీ రూ. 1813 కోట్లు చెల్లించనుంది. చిన్న కార్ల మార్కెట్ పెద్ద ఆకర్షణీయంగా లేదని కంపెనీ ఛైర్మన్ ఆర్సీ భార్గవ అన్నారు. చిప్ కొరత కారణంగా 2.7 లక్షల వాహనాలను తయారు చేయలేకపోయామని అన్నారు. మానేసర్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరో లక్ష యూనిట్లకు పెంచుతారని, ఈ విస్తరణ 2024కల్లా పూర్తవుతుందని అన్నారు.