పదే పదే తప్పుడు ప్రచారం
కోర్టు చీవాట్లు పెట్టినా.. ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు తమ ధోరణి మార్చుకోవడం లేదు. చందాదారుల్లో భయం కల్గించి మార్గదర్శి వ్యాపారాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా మీడియా సమావేశాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఐడీ చేస్తున్న ఈ ప్రయత్నాలను మార్గదర్శి సంస్థ మరోసారి గట్టిగా తప్పి కొట్టింది. తమ సంస్థపై అక్కసుతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆరోపించింది. ఇవాళ ఉదయం అమరావతిలో ఏపీ సీఐడీకి చెందిన ఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ మార్గదర్శిపై పలు ఆరోపణలు చేశారు. దీన్ని ఖండిస్తూ మార్గదర్శి సంస్థ కొద్దిసేపటి క్రితం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తమ కంపెనీపై ఏపీ సీఐడీ పదేపదే ఆరోపణలు చేయటం పూర్తిగా కక్షసాధింపు చర్యగానే తాము భావిస్తున్నామని పునరుద్ఘాటించింది. చందాదారులను భయపెట్టేందుకు తమ సంస్థపై ఏపీ సీఐడి ఎస్పీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది.
తాజాగా ఉషోదయ ఎంటర్‌ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్, ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ తాము పెట్టిన రూ. 15.81 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు సీఐడీ ప్రకటించడాన్ని ఖండించింది. ఇప్పటికే రూ.1,035 కోట్ల ఆస్తులను అటాచ్ చేయడాన్ని ప్రస్తావించింది. ఇదే విషయాన్ని సీఐడి పదేపదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రకటించడం కేవలం … చందాదారులను భయాందోళనకు గురిచేయడం కోసమేనని మార్గదర్శి స్పష్టం చేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌పై కోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించినా… మళ్ళీ తప్పుడు సమాచారంతో చందాదారులను భయపెట్టే
ప్రయత్నం చేస్తోందని.. ఇది కేవలం తమ సంస్థపై సీఐడి చేస్తున్న కక్షసాధింపేనని పేర్కొంది.
ఏకైక అజెండా
తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చాలనే ఏకైక అజెండాతో తమ వ్యాపారాన్ని అప్రతిష్ఠ పాలు చేయటానికి సీఐడీ ప్రయత్నిస్తోందని మార్గదర్శి ఆరోపించింది. చందాదారుల్లో తమపై ఉన్న నమ్మకాన్ని ఎదుర్కొనలేక.. ప్రజలను గందరగోళ పర్చడానికి సీఐడీ అధికారులతో ఏపీ ప్రభుత్వం
పదేపదే ఇటువంటి తప్పుడు ప్రచారం చేయిస్తోందని మార్గదర్శి పేర్కొంది. చట్టాలకు విరుద్ధంగా తమపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యా ప్తు చేపట్టిందని మార్గదర్శి ఆరోపించింది. చట్టాల్లోని నిబంధనలపై పూర్తి అవగాహన లేమితో సీఐడీ దురుద్దేశపూర్వకంగా మీడియా ద్వారా
తమపై తప్పుడు ప్రకటనలు చేస్తోందని స్పష్టం చేసింది. తమ చట్ట వ్యతిరేక చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తోందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్క చందాదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకున్నా… ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్లు తమ చిట్ గ్రూప్‌లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారని మార్గదర్శి ఆరోపించింది. దీనిపై తాము హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించింది. రిజిస్ట్రార్లు జారీ చేసిన చిట్ మూసివేత ఉత్తర్వులు తమ ప్రయోజనాలకు దెబ్బతీస్తాయని… దురుద్దేశపూర్వకంగానే పక్కా ప్లాన్‌తో చేస్తున్న ఈ దాడి నుంచి కాపాడాలని హైకోర్టును తాము కోరామని పేర్కొంది. తమ వాదనలను విన్న తరవాత రిజిస్ట్రార్లు జారీ చేసిన చిట్ మూసివేత ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసిన విషయాన్ని మార్గదర్శి ప్రస్తావించింది. రిజిస్ట్రార్ల ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలకు, పిటిషనర్ల ప్రయోజనాలకు విరుద్ధమని కోర్టు పేర్కొందని తెలిపింది. అలాగే రిజిస్ట్రార్ల చర్యలను సవాలు చేస్తూ రిట్ పిటిషన్లు దాఖలు చేసిన చందాదారులను ఏపీ సీఐడీ బెదిరిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని మార్గదర్శి పత్రికా ప్రకటనలో పేర్కొంది. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. తమ చందాదారులను తప్పు దారి పట్టించేందుకు
నిరాధారమైన ఆరోపణలను ఏపీ సీఐడీ అధికారులు చేస్తున్నారని మార్గదర్శి పేర్కొంది. దర్యా ప్తులో ఉన్న కేసుకు సంబంధించి పోలీసు అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రసారం చేయడం మానుకోవాలని కోర్టు పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించింది. చిట్ ఫండ్స్ చట్టం, కంపెనీల చట్టం లేదా ఆదాయపు పన్ను చట్టంలోని ఎలాంటి నిబంధనలను తాము ఉల్లంఘించలేదని మార్గదర్శి పునరుద్ఘాటించింది. ప్రైజ్ మనీ చెల్లింపులు ఎప్పటిలాగే సకాలంలో చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే చందాదారులకు చెల్లించాల్సిన మొత్తాలను సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తామని మార్గదర్శి స్పష్టం చేసింది.