For Money

Business News

సమీర్‌తో మాగుంట భేటీ నిజమే

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అయిన సమీర్‌ మహేంద్రుతో వైకాపా పీఎం మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం పలుమార్లు భేటీ అయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీటులో పేర్కొంది. ఇండో స్పిరిట్‌ వ్యాపార వ్యవహారాల్లో కవిత ప్రయోజనాలకు అరుణ్‌ పిళ్లై.. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రయోజనాలకు ప్రేమ్‌రాహుల్‌ మండూరి ప్రాతినిధ్యం వహించారని వెల్లడించింది. ఇండో స్పిరట్‌లో మాగుంట తరఫున ప్రేమ్‌ రాహుల్‌ మందురీకి 32.5 శాతం వాటా ఉందని ఈడీ పేర్కొంది. మాగుంట ఫ్యామిలీకి చెందిన జైనాబ్‌ ట్రైడింగ్‌, ఖావో గలీకి ఈఎండీ కింద రూ.15 కోట్లు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్‌ చెల్లించాడని పేర్కొంది. మాగుంట ఆగ్రోఫామ్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట రాఘవ్‌కు రెండు రిటైల్‌ జోన్లు ఉన్నాయి. అంటే సొంత కంపెనీతో పాటు జైనాబ్‌ ట్రైడింగ్‌, ఖావో గలీ కంపెనీలు కూడా మాగుంట కుటుంబానివేనని ఈడీ అంటోంది. సమీర్‌ మహేంద్రు ఢిల్లీలోని మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలో సమావేశమయ్యారని ఈడీ తెలిపింది. శ్రీనివాసులు రెడ్డితోపాటు ఆయన కుమారుడు రాఘవ్‌, బుచ్చిబాబు ఈ సమావేశంలో పాల్గొన్నారని, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారని వెల్లడించింది.
ముత్తాకు నిధులు
అరుణ్‌ పిళ్లై సూచనల మేరకు సమీర్‌ మహేంద్రుకు చెందిన ఇండోస్పిరిట్స్‌ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌కు రూ.కోటి, ఇండియా ఎహెడ్‌ సంస్థకు రూ.70 లక్షలు బదిలీ చేశారు. ఈ రెండు కంపెనీలు ముత్తా గౌతమ్‌కు సంబంధించినవి.